
11న కలెక్టరేట్ వద్ద విద్యార్థుల మహాధర్నా
● పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల విడుదల కోసం.. ● జీవో 77 రద్దుకు డిమాండ్ ● జిల్లా వ్యాప్తంగా నిరసనలకు ఏఐఎస్‌ఎఫ్ పిలుపు
విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్పుల బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 11న కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు ఏఐఎస్‌ఎఫ్ వెల్లడించింది. ఈ మేరకు నగరంలోని ఏఐఎస్‌ఎఫ్ కార్యాలయంలో దీనికి సంబంధించి కరపత్రాలను ఆదివారం ఆ సంఘ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు త్రైమాసికాల ఫీజు బకాయి లు రూ.4200 కోట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేస్తామని యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నేటికీ ఆ హామీ నెరవేరలేదన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారని ధ్వజమెత్తారు. అలాగే ఎన్నికల సమయంలో జీవో 77 రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని అదీ నెరవేరలేదన్నారు. ఈ జీవో వల్ల పేద వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య తీరని కల గానే మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను తక్షణ మే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీటి కోసం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 11న జరగనున్న కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు విద్యార్థులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఏస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యద ర్శి పి.గౌరీశంకర్, పట్టణ నాయకులు నవీన్, సా యి, రాము, రామకృష్ణ, ప్రవీణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.