● 8, 9 తేదీల్లో ఓపెన్ కౌన్సెలింగ్
విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2025–26 విద్యాసంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఈ నెల 8, 9వ తేదీల్లో ఓపెన్ కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామని విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్‌లో 8వ తేదీన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలిజీ, ఎంబీఏ, 9వ తేదీన పీజీ ఇంగ్లిష్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆయా రోజుల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కౌన్సెలింగ్‌కు సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాలతో నేరుగా యూనివర్సిటీకి హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ ‘సీటీయూఏపీ.ఏసీ.ఐఎన్’ను సందర్శించాలన్నారు.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యవకుల అరెస్టు
విజయనగరం క్రైమ్: విజయనగరం సీఎంఆర్ కూడలి వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను మంగళవారం అరెస్టు చేసినట్టు వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. గాజులరేగకు చెందిన బెవర గణేష్, పద్మావతి నగర్‌కు చెందిన బోగి రాహుల్ 300 గ్రాముల గంజాయిని ప్యాకెట్‌లలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారన్నారు. వారి నుంచి 300 గ్రాముల గంజాయి, రూ.200 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
మున్సిపల్ ఉద్యోగుల వినూత్న నిరసన
నెల్లిమర్ల: కూటమి ప్రభుత్వ తీరుపై నెల్లిమర్ల నగర పంచాయతీ అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజినీరింగ్ విభాగం ఉద్యోగులు చెవిలో పూలుపెట్టుకుని వినూత్నరీతిలో మంగళవారం నిరసన తెలిపారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ కనీస వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, రిటైర్‌మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ తారక్‌నాథ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గోవింద్, బాబూరావు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
దొంగతనానికి వెళ్లి.. అక్కడే నిద్రపోయి..
బొబ్బిలి: ఓ ఇంటిలో ఐదు రోజులుగా దొంగతనం చేస్తూ అదే ఇంటింలో మద్యం మత్తులో నిద్రపోయిన దొంగను బొబ్బిలి పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బొబ్బిలి పట్టణం గొల్లపల్లి అంబేడ్కర్ కాలనీలో నివసిస్తున్న శీర శ్రీనివాసరావు వ్యవసాయ పనుల నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట స్వగ్రామమైన అలజంగి వెళ్లారు. ఈ విషయాన్ని కనిపెట్టిన పిరిడి గ్రామానికి చెందిన కె.కృష్ణ ఆ ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలో ఉన్న వెండి, ఇత్తడి సామాన్లు దొంగిలించి విక్రయించడం, కొనకపోతే తాకట్టు పెట్టడం చేసి మద్యం కొనుగోలు చేసి ఆ ఇంట్లోకే వెళ్లి తాగుతూ, తింటూ గడిపాడు. ఐదు రోజులుగా ఇదే తంతు జరుగుతోంది. ఇంటి యజమాని మరో రెండు రోజులు రాడనుకున్నాడో ఏమో మంగళవారం కూడా మరికొన్ని సామాన్లు విక్రయించి పూటుగా మద్యం తాగి ఎప్పటివలే చల్లగా ఉందని ఇంటి గచ్చుపై నిద్రపోయాడు. స్థానికులు దొంగను గుర్తించి అలజంగిలో ఉన్న శ్రీనివాసరావుకు సమాచారమందించారు. ఈ లోగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారమందుకున్న ఎస్‌ఐ ఆర్.రమేష్ కుమార్ తన సిబ్బందితో వచ్చ దొంగను పట్టుకున్నారు. అప్పటికే నిద్రమత్తులో ఉండడంతో పిరిడిలోని కృష్ణ ఇంటికి ఫోన్ చేశారు. అతడిని ఇంటికి పంపొద్దంటూ కుటుంబ సభ్యులు తిరిగి పోలీసులను వేడుకోవడం గమనార్హం. కేసు నమోదు చేయడమా, లేదంటే దొంగకు కౌన్సెలింగ్ ఇవ్వడమా అన్నది బుధవారం తేల్చుతామని ఎస్‌ఐ తెలిపారు.
గిరిజన యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు
గిరిజన యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు