
మీ సేవలు వెలకట్టలేనివి
● ఎస్పీ వకుల్ జిందల్
● ఉద్యోగవిరమణ పొందిన ఐదుగురు
అధికారులకు ఘన సన్మానం
విజయనగరం క్రైమ్: సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహించిన పోలీస్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌ఐలు సర్దార్ ఖాన్, ముడసాల వేణుగోపాలస్వామి, కుచ్చర్లపాటి తిరుమలరాజు, జామి ఏఎస్‌ఐ ఆర్‌వీఏ నర్సింగరావు, ఆర్మ్‌డ్ రిజర్వ్ ఏఆర్‌ఎస్‌ఐ ఊయక గుంపస్వామిలను జిల్లా పోలీస్‌శాఖ తరఫున జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అంటేనే క్లిష్టపరిస్థితులు, విభిన్న వాతావరణంలో ఆరోగ్యంపై కూడా శ్రద్ధచూపేందుకు అవకాశం లేని పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఐదుగురు అధికారులు పోలీస్ శాఖలో ఎలాంటి రిమార్కులు లేకుండా విధులు నిర్వర్తించడంతో పాటు పిల్లలను ఉన్నత విద్యావంతులుగా, ఉద్యోగులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. విశ్రాంత జీవితాన్ని ఆనందంగా సాగించాలని, సమాజానికి సేవ చేయాలని, పోలీస్ శాఖ తరఫున ఎలాంటి సాయం కావాలన్నా సంప్రదించాలని సూచించారు. అనంతరం ఉద్యోగుల దంపతులను దుశ్శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. జిల్లా కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరఫున గిఫ్ట్ చెక్కులను అందజేశారు. ఉద్యోగ విరమణ చేసిన అధికారులు మాట్లాడుతూ తమ సర్వీసులో సహాయ, సహకారాలను అందించిన అధికారులు, సహోద్యోగులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ ఏఆర్ జి.నాగేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ వై.రవీంద్రారెడ్డి, ఎస్‌బీ సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.కె.చౌదరి, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు ఎన్. గోపాలనాయుడు, టి.శ్రీనివాసరావు, ఆర్.రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.