
హామీల అమలుపై అబద్ధాలు
● కూటమి ఏడాది పాలనలో చితికిపోయిన పేదకుటుంబాలు
● ప్రజల్లోకి ప్రభుత్వ మోసకారి పాలన
● ఏడాదిలో కనీస అభివృద్ధికి
నోచుకోని జిల్లా
● జనాదరణ చూసి ఓర్వలేకే
జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు
● ఈ నెల 3న వైఎస్సార్ సీపీ జిల్లా
విస్తృతస్థాయి సమావేశం
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా
అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
జగన్‌పై తప్పుడు కేసులు
ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు అత్యంత ప్రజాదరణ వస్తుండడం చూసి ఓర్వలేక అక్రమ కేసులు పెడుతున్నారని మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. కేవలం భయబ్రాంతులను చేసేందుకు పోలీసులను ఉపయోగించి కట్టడి చేసేందుకు ప్రయత్నించినా జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలకున్న అభిమానాన్ని అడ్డుకోలేరన్నారు.
విజయనగరం:
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా అబద్ధాలు చెబుతూ పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రజలకు ఏం మేలు చేశామని ఈ నెల 2వ తేదీ నుంచి ఇంటింటికీ వెళ్లి కూటమి నేతలు చెప్పగలరని ప్రశ్నించారు. కూటమి నాయకత్వంపై ఆ పార్టీ నాయకులకే నమ్మకం పోయిందని, ముఖ్యమంత్రి సమావేశం పెడితే ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో పార్టీ జిల్లా నాయకులతో కలిసి మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి కూటమి ఏడాది పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయం, మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా దిశానిర్దేశం చేశారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హమీలను అమలుచేయకుండా చేశామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. హమీల అమలుపై ఎవరైనా నిలదీస్తే ఊరుకునేది లేదంటూ పరుషపదజాలం ప్రయోగించడం ఆశ్చర్యకరంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు హమీలు అమలుపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాది పాలనపై మోసకారి మాటలు చెబుతున్న కూటమి ప్రభుత్వ విధానాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించేలా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తామని తెలిపారు. గత ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన బాండ్లుతో పాటు, చేసిన హమీలు, బాబూ ష్యూరిటీ భవిష్యత్ గ్యారింటీ ప్రచారాలు ఎంత వరకు అమలు చేశారో ప్రజలతో చెప్పిస్తామన్నారు. ఏడాది కాలంలో బాబు ష్యూరిటీ... మోసం గ్యారెంటీ అన్న చందంగా పాలన సాగిందని ఎద్దేవా చేశారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని చెప్పారు.
హామీల అమలెక్కడ?
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్, నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతి, ఆడపిల్ల నిధి కింద నెలకు రూ.1500 తదితర హమీలు అమలెప్పుడో చంద్రబాబు చెప్పాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రైతాంగానికి ఇస్తామన్న రెండేళ్ల పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన 140కు పైగా హమీల అమలుపై ప్రతి ఇంటికీ వెళ్లి అడిగి తెలుసుకుంటామని, వారికి జరుగుతోన్న నష్టాన్ని వివరిస్తామని స్పష్టం చేశారు.
పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం రేపు
ఏడాదిలో ఏం అభివృద్ధి చేశారు...?
ఏడాది కూటమి పాలనలో విజయనగరం జిల్లాలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పింఛన్లు కోసం గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం మూడు నెలల కిందట స్పౌజ్ పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు జీఓ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేకపోయారని చెప్పారు. ఒక్క విజయనగరం జిల్లాలో 4000 మంది లబ్ధిదారులు పింఛను కోసం ఎదురు చూసే దుస్థితి నెలకొందన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేదని, కనీసం అధికారులు నిర్వహించే సమావేశాలకు హాజరుకాకుంటే సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చామంటూ చెప్పుకుంటున్న కూటమి నాయకులు ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య ఏడాదిలో గణనీయంగా తగ్గిపోయిందో చెప్పాలన్నారు. జిల్లాలోని మెరకమూడిదాం మండలంలో ఏడాది కాలంలో ప్రభుత్వ బడుల్లో 1100 మంది విద్యార్థులు తగ్గిపోయారని చెప్పారు. అన్ని వ్యవస్థలు, రంగాలను అవినీతిమయంగా మార్చేశారని... ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య సమన్వయం లేకపోవటం దురదృష్టకరమని వాఖ్యానించారు. ఇలా అయితే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు.
జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 3వ తేదీన వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు. నగరంలోని పూల్‌బాగ్ జగన్నాథ కళ్యాణ మండపంలో ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తారన్నారు. సమావేశానికి ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, మాజీ ఎంపీలు, పార్టీ జిల్లా నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండలాధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న నాయకులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, ఇప్పిలి అనంత్, జిల్లా పార్టీ కోశాదికారి సిరిపురపు జగన్‌మోహన్‌రావు, ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారయణ, వెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వల్లిరెడ్డి శ్రీనివాస్, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు బూర్లె నరేష్, అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, జెడ్పీటీసీ సభ్యుడు గార తవుడు, తదితరులు పాల్గొన్నారు.