
చిల్లంగి నెపంతో మహిళ హత్య?
బొబ్బిలి: పట్టణంలోని బండారు వీధిలో నివాసముంటున్న కరగాని పద్మ(45) అనే మహిళ హత్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం తాను నివసిస్తున్న ఇంట్లోంచి తీవ్ర గాయాలతో అరుస్తూ వచ్చి గుమ్మం వద్ద పడిపోవడంతో స్థానికులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో పోస్ట్‌మార్టం రూమ్‌కు తరలించారు. పక్క పక్క ఇళ్లలో ఉంటున్న కుటుంబసభ్యులే హతమార్చి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. కరగాని పద్మ పలువురి ఇళ్లలో పనులు చేసుకుంటోంది. భర్త పైడిరాజు మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెళ్లిళ్‌లై ఆటోలు నడుపుకుంటూ వేరే చోట ఉంటున్నారు. పద్మ చిల్లంగి పెట్టడం వల్ల తన భార్య చనిపోయిందని, కుమారుడు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందని, దీనందటికీ పద్మే కారణమన్న అనుమానంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసినట్లు పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు.
డీఎస్పీ పరిశీలన
ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ జి.భవ్యారెడ్డి మృతురాలు పద్మ నివసిస్తున్న ఇంటిని పరిసరాలను పరిశీలించారు. ఎస్సై రమేష్‌కుమార్‌తో కలిసి కుటుంబసభ్యులు, స్థానికులను విచారణ చేశారు. అనంతరం క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించారు.
కత్తిపీటపై పడిపోయిందని..
డీఎస్పీ, పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను విచారణ చేయగా పద్మ కత్తిపీటమీద పడిపోయిందని, గాయాల పాలై చనిపోయిందని కుటుంబసభ్యులు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.

చిల్లంగి నెపంతో మహిళ హత్య?