
అయ్యవార్లకు తిప్పలు
● మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం ● ‘అపస్’ ఫిర్యాదుతో తేరుకున్న కేజీహెచ్ వైద్యులు ● హడావుడిగా డీఈవో కార్యాలయానికిఅందజేత ● ఉమ్మడి విశాఖ జిల్లాలో1,200 మంది పీహెచ్ టీచర్లు ● వీరిలో 442 మంది వైకల్యంపై నిశిత పరిశీలన
విశాఖ విద్య: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు తీవ్ర కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం జారీ చేసిన బదిలీల చట్టం మేరకు ఖాళీల గుర్తింపు ఒక కొలిక్కి వచ్చింది. పాఠశాలల పునర్నిర్మాణంపై ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చినా.. బదిలీలు చేపట్టేలా విద్యాశాఖాధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యతల పాయింట్లు కేటాయింపునకు సంబంధిత ఉపాధ్యాయులు నమోదు చేసుకోవాలని డీఈవో కార్యాలయ అధికారులు ప్రత్యేక గూగుల్ ఫాంను విడుదల చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, దివ్యాంగ ఉపాధ్యాయులు వెంటనే ఈ ఫాం పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే జిల్లా స్థాయి ప్రత్యేక శిబిరానికి హాజరైనా.. నేటికి కూడా మెడికల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గూగుల్ ఫాం పూర్తి చేయాలని ఆదేశించడంతో అయ్యవార్లకు తిప్పలు తప్పడం లేదు.
వైకల్యం నిజమేనా?
బదిలీల సందర్భంగా ప్రాధాన్యత కోరుతున్న ఉపాధ్యాయులు గతంలో సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్లు చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాటి కోసం మళ్లీ వైద్యుల ముందు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో 1,200 మంది వరకు ప్రాధాన్యత పాయింట్లు పొందే ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 56 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు గతంలో సమర్పించిన సర్టిఫికెట్లలో వాస్తవమెంత అనేది తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా మెడికల్ బోర్డు ముందు 442 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. సర్టిఫికెట్ల జారీ కోసం కొంతమంది ఉపాధ్యాయులు వైద్యులను మేనేజ్ చేశారని ప్రచారం సాగుతోంది.
20 రోజులు గడిచినా అందని సర్టిఫికెట్లు
జిల్లా స్థాయి మెడికల్ బోర్డు ముందు హాజరై 20 రోజులు గడుస్తున్నా.. వైకల్య ధ్రువీకరణ పత్రాలు(మెడికల్ సర్టిఫికెట్లు) అందకపోవడంపై కొంతమంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయమై అపస్ సంఘం జిల్లా నాయకులు శుక్రవారం కేజీహెచ్ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేశారు. దీంతో తేరుకున్న కేజీహెచ్ పాలనాధికారులు ఆయా విభాగాల్లో ఉన్న సర్టిఫికెట్లు సేకరించి, హుటాహుటిన డీఈవో కార్యాలయానికి పంపించారు.
ఎంఈవోలకు పంపించాం
కేజీహెచ్ నుంచి శుక్రవారం మెడికల్ సర్టిఫికెట్లు అందాయి. వాటిని అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా డీఈవోలకు వెంటనే పంపించాం. విశాఖ జిల్లాకు సంబంధించి ఎంఈవోల ద్వారా సంబంధిత ఉపాధ్యాయులకు అందించాలని ఆదేశించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశాం.
– ఎన్.ప్రేమ్ కుమార్, నోడల్ అధికారి, ఉమ్మడి విశాఖ జిల్లా
దివ్యాంగులకు న్యాయం చేయాలి
దివ్యాంగుల చట్టాన్ని ప్రభుత్వం విస్మరించింది. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా బదిలీల్లో ప్రాధాన్యం కల్పించి దివ్యాంగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి.
–ఎ.శ్రీనివాసరావు, వికలాంగుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, విశాఖపట్నం

అయ్యవార్లకు తిప్పలు

అయ్యవార్లకు తిప్పలు