ఎర్రచందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం చెట్లను నరకడానికి ప్రయత్నించిన కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి మంగళవారం తీర్పు చెప్పినట్టు ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ ఫారెస్ట్ సిబ్బంది 2017 సంవత్సరంలో శేషాచలం, నాగపట్ల బీట్, టీఎన్ పాళెం సెక్షన్ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాకు చెందిన విజయ్ కుమార్, మణి అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా అటవీ ప్రాంతంలో ఉండడాన్ని గుర్తించారు. ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికి శిక్ష విధించారు.


