
దర్జాగా రేషన్ దందా
● ఆగని అక్రమ రవాణా
● మిల్లర్ల లైసెన్స్ పేరుతో టోకరా
● నకిలీ బిల్లులతో అక్రమ వ్యాపారం
● తమిళనాడు, ఏపీ రేషన్ బియ్యం తరలింపు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : పేదల నోటి దగ్గరికి చేరాల్సిన రేషన్ బియ్యం సరిహద్దులు దాటిపోతోంది. సూళ్లూరుపేట, తడ ప్రాంతంలో తమిళనాడు, ఆంధ్రా రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సూళ్లూరుపేట, తడ ప్రాంతాలు తమిళనాడుకు దగ్గరగా ఉండడంతో ఇక్కడ పలు ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని ఆంధ్రా, తమిళనాడు రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేసుకుని వాటిని గోతాలు మార్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతంలో ఈ వ్యాపారాన్ని స్థానికంగా ఉన్న కొన్ని రైస్ మిల్లులను కేంద్రంగా చేసుకుని అక్రమ రవాణా సాగించేవారు. దీనివల్ల కలిగిన ఇబ్బందులతో ఈ వ్యాపారాన్ని మిల్లర్లు మానేయడంతో పట్టణంలో లైసెన్స్‌ల పేరుతో అక్రమంగా రేషన్ బియ్యం దందా సాగిస్తున్నారు.
తమిళనాడు రేషన్ దుకాణాల్లో ఇచ్చే ఉప్పుడు బియ్యం, ఏపీలోని రేషన్ దుకాణాల్లో ఇచ్చే ఆంధ్రా బియ్యంను బ్లాక్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి పట్టణంలోని పలు ప్రాంతాల్లోని గోదాముల్లో నిల్వ చేసి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఈ రేషన్ బియ్యానికి గోతాలు మార్చి మామూలు బియ్యం లాగానే బస్తాలను తయారు చేసుకుని ప్రతి రోజు ఇతర ప్రాంతాల్లోని రైస్ మిల్లులకు రవాణా చేస్తున్నారు. దీనికి నకిలీ బిల్లులు తయారు చేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ప్రతి రోజూ చైన్నె నుంచి సూళ్లూరుపేటకు వస్తున్న సబర్బన్ రైళ్లో చిన్న చిన్న బస్తాలుగా తయారు చేసి తమిళనాడుకు చెందిన కొంత మంది సూళ్లూరుపేటకు తెస్తున్నారు. ఇక్కడ కొంత మంది చిల్లర వ్యాపారాలు కొనుగోలు చేసి గోదాములో నిల్వ చేసుకుంటున్నారు. అదే విధంగా స్థానికంగా ఉన్న డీలర్లును కూడా మేనేజ్ చేసి రేషన్ బియ్యం బస్తాలను కొనుగోలు చేసి గోతాలు మార్చేసి అక్రమ రవాణా చేసేస్తున్నారు.
కొనుగోళ్లు ఇలా..
తమిళనాడు ప్రాంతం నుంచి చిల్లరగా తెచ్చే రేషన్ బియ్యంను సూళ్లూరుపేటలో కొంత మంది కిలో రూ. 5 నుంచి 9 దాకా కొనుగోలు చేస్తారు. ఇలా రోజుకు సుమారు టన్నుకు పైగా కొనుగోలు చేసి గోతాలు మార్చి కొత్త బస్తాల్లాగా తయారు చేస్తారు. వీటితో పాటు తమిళనాడు పార్శిల్ ఆటోల ద్వారా అక్రమ రేషన్ బియ్యం తెస్తున్నారు. వీరి వద్ద నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి మిల్లర్లకు 15 నుంచి 20 రూపాయలు దాకా అమ్మేస్తారు. మిల్లర్లు ఆ బియ్యానికి పాలిష్ పట్టి మార్కెట్‌లోకి పంపించి కిలో 50 రూపాయల లెక్కన అమ్ముతారు.అదే విధంగానే ఏపీ రేషన్ బియ్యం కూడా ఇదే తరహాలోనే కొనుగోలు చేసి పాలిష్ పట్టి 25 కేజీల బస్తాలో సుమారు 8 కేజీలు దాకా పాలిష్ పట్టిన రేషన్ బియ్యం కలుపుతారు. ఇలా నెల్లూరు, విజయవాడ, మండపేట ప్రాంతాల్లో రైస్ మిల్లులకు తరలించి కోట్ల రూపాయలను ఆర్జిస్తుండడంతో అందరి చూపు ఈ అక్రమ రేషన్ వ్యాపారంపై పడింది. ఈ వ్యాపారంలో ఆదాయ వనరులు పుష్కలంగా ఉండడంతో ఈ వ్యాపారాన్ని లక్షలాది రూపాయలు ముడుపులు పోలీసులు, విజిలెన్స్ వారికిచ్చి సజావుగా నడిపిస్తున్నారు. లెసెన్స్ బియ్యం వ్యాపారం దుకాణం పేరుతో ఈ అక్రమ వ్యాపారం చేస్తుండడం, అందరికీ నెల మామూళ్లు ఇస్తుండడంతో ఈ అక్రమ రవాణా గురించి తెలిసినా అధికారులు, పోలీసులు ఏమీ తెలియనట్టే నటిస్తున్నారు.
ఒకవేళ లారీని పట్టుకున్నా 6ఏ కేసు నమోదు
బియ్యం అక్రమ రవాణాలో పట్టుకున్నా ఆదాయమే. ఎందుకంటే కేసుల కోసం పోలీసులు ఒకటి రెండు లారీలను పట్టుకుంటారు. వాటిపై 6ఏ కేసు నమోదు చేసి నెమ్మదిగా బియ్యం లారీలను రిలీజ్ చేస్తారు. నామమాత్రంగా ఒకరిద్దరు మీద కేసులు పెడతారు. ఈ తంతు బియ్యం అక్రమ వ్యాపారాలు చేసే వారికి అలవాటుగా మారిపోయింది. అందుకే పోలీసులు దాడులు చేసి ఎన్ని లారీల బియ్యం పట్టుకున్నా సరే అక్రమార్కులు ఈ వ్యాపారాన్ని ఆపడం లేదు. ఇందులో ఉన్న లొసుగులను ఔపోసన పట్టేయడంతో అధికారులు కూడా ఏమీ చేయలేక వారి ఇచ్చిన నెల మామూళ్లు తీసుకుని కేసుల కోసం మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకటి రెండు లారీలను పట్టుకుని కేసులు పెడుతున్నట్టుగా చేతులు దులుపేసుకుంటున్నారు.
వాటాల కోసం కూటమి నేతలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యాపారంలో వాటాలు కావాలని కూటమి నేతలు పట్టుబట్టడంతో కొద్దిరోజులు వ్యాపారాన్ని అపేశారు. ఇందులో ఒక బ్యాచ్ ఆపకపోవడంతో వారి లారీలను కూటమి నేతలు పట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఆ తరువాత దీనిపై పెద్ద ఎత్తున రాజీ చర్చలు జరిగాయి. ఒక దశలో టీడీపీ అగ్ర నాయకులు దాకా కూడా ఈ వ్యవహారం వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న బ్యాచ్‌ల మధ్య రాజీ కుదుర్చుకుని కూటమి నేతలకు నెల మామూళ్ల కింద వాటాలు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకుని అక్రమ వ్యాపారాన్ని దర్జాగా సాగిస్తున్నారు.

దర్జాగా రేషన్ దందా

దర్జాగా రేషన్ దందా