
ముగ్గురు చైన్ స్నాచర్ల అరెస్ట్
తిరుపతి క్రైం: శ్రీకాళహస్తిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన మంగళవారం ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఆరుసార్లు చోరీలకు పాల్పడిన ముగ్గురిని సోమవారం సాయంత్రం శ్రీకాళహస్తి మిట్ట కండ్రిగ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు తమిళనాడు రాష్ట్రం, వందలూరు కండ్రిగకు చెందిన మూతం మని మారన్ అలియాస్ మనీ(27), వెంకటగిరి చెందిన మారి మాణిక్యం(25), శ్రీకాళహస్తికి చెందిన కొట్టం బేటి రాజా(20)గా తేలిందన్నారు. వీరి నుంచి రూ.13 లక్షలు విలువ చేసే 139 గ్రాముల బంగారు, హీరో స్పెండర్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేస్తున్నామన్నారు. ఈ కేసును ఛేదించడంలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీసులు, క్రైమ్ పోలీసులు చేసిన కృషి అభినందనీయమన్నారు.
55 మందిపై నిఘా
జిల్లా వ్యాప్తంగా 55 మంది చెయిన్ స్నాచర్లపై నిఘా పెట్టమని ఎస్పీ పేర్కొన్నారు. వారిలో ఇప్పటికే 40 మందిని పూర్తిస్థాయిలో గుర్తించామన్నారు. వీరందరిపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకుంటున్నామని తెలిపారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పాడుబడ్డ గృహాల వద్ద ఐదుగురు యువకులు గంజాయి తాగుతూ డ్రోన్ కెమెరాలకు దొరికారన్నారు. వీరందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించి, కేసులు నమోదు చేశామన్నారు.