సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన టీఎస్‌ఆర్టీసీ

TSRTC Plans Convert Diesel Buses To Electric Buses - Sakshi

బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు ఆర్టీసీ యోచన..

ప్రయోగాత్మకంగా ఓ సంస్థతో ఒప్పందం

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటికే అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న టీఎస్‌ఆర్టీసీ రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్‌ ధరల వల్ల ఎదురవుతున్న నష్టాల నుంచి బయటపడేందుకు సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎలక్ట్రిక్‌ వాహన విధానం కింద బస్సులను ఎలక్ట్రిక్‌ మోడ్‌లోకి ప్రయోగాత్మకంగా పరిశీలించి చూడాలని నిర్ణయించింది. ఇందుకోసం డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చే ఓ ప్రైవేటు సంస్థకు ఒక సిటీ బస్సును కేటాయించింది. ఆ సంస్థ సిటీ బస్సు డీజిల్‌ ఇంజన్‌ను ఎలక్ట్రిక్‌ ఇంజన్‌గా మార్చి మూడు నెలలపాటు దాని పనితీరును పరిశీలించనుంది.

ఈ మూడు నెలల కాలంలో ఎలక్ట్రిక్‌ బస్సు నిర్వహణ వ్యయాన్ని డీజిల్‌ బస్సు నిర్వహణ వ్యయంతో పోల్చి చూపనుంది. అది అనుకూలంగా ఉంటే మిగతా బస్సులను కూడా అలా మార్చాల్సి ఉంటుంది. అప్పుడు టెండర్లు పిలిచి తక్కువ వ్యయంతో ప్రాజెక్టు నివేదిక ఇచ్చే సంస్థకు కన్వర్షన్‌ బాధ్యత అప్పగించాలన్నది ఆర్టీసీ ఆలోచన. ఈ ప్రయోగం సత్ఫలితాలిస్తే ఒక్క హైదరాబాద్‌ సిటీ రీజియన్‌ పరిధిలో డీజిల్‌ రూపంలో అవుతున్న రూ. 460 కోట్ల వార్షిక భారం తొలగిపోనుంది. అదే మొత్తం సంస్థకు వర్తిస్తే ఏకంగా రూ. 1,926 కోట్ల వ్యయం తప్పుతుంది.

ఖర్చు ఆ సంస్థనే భరించేలా..
ప్రస్తుతం డీజిల్‌ ఇంజన్ల బస్సులను ఎలక్ట్రిక్‌ ఇంజన్లుగా మార్పిడి (కన్వర్షన్‌) చేసే ఖర్చు కూడా భారీగా ఉంది. ఆ భారాన్ని సైతం భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. అందుకోసం ఆర్టీసీ మరో ప్రయోగం చేయాలన్న యోచనలో ఉంది. హైదరాబాద్‌లో 3 వేల బస్సులు తిరుగుతున్నాయి. వాటి రోజువారీ డీజిల్‌ ఖర్చు రూ. 1.30 కోట్లు. ప్రస్తుత డీజిల్‌ ధర ప్రకారం సాలీనా రూ. 460 కోట్లను దాటుతుంది. ఇక్కడ ఆర్టీసీకి డీజిల్‌ ద్వారా కిలోమీటర్‌కు రూ. 18 వరకు ఖర్చవుతోంది. అదే బ్యాటరీ బస్సుతో ఆ ఖర్చు రూ. 6 వరకే (ఎయిర్‌పోర్టుకు నడుపుతున్న బస్సుల ఖర్చు మేరకు) అవుతుంది.

అంటే కిలోమీటర్‌కు దాదాపు రూ. 12 వరకు మిగులుతుంది. దీంతో కన్వర్షన్‌ భారాన్ని ఆ సంస్థనే తీసుకునేలా ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది. ఆ ఖర్చు భరించినందుకు.. ఈ మిగులుబాటు మొత్తాన్ని ఆ సంస్థ తీసుకుంటుంది. ఇలా దాదాపు ఐదేళ్లపాటు ఆ సంస్థ ఈ మిగులు మొత్తాన్ని తీసుకుంటుంది. ఆ తర్వాత బస్సులన్నీ ఆర్టీసీ సొంతమవుతాయి. కన్వర్షన్‌ భారాన్ని భరించకుండానే ఎలక్ట్రిక్‌ బస్సులు చేతికందినట్టు అవుతాయన్నది ఆర్టీసీ ఆలోచన. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా ఓ బస్సును ఆ సంస్థకు ఇచ్చినా.... టెండర్లు పిలిచే నాటికి మరింత యోచించి నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top