అసైన్డ్‌ భూములపై తర్జనభర్జన!

Telangana government Focus assigned lands - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అసైన్డ్‌ భూములపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. ఈ భూములకు సంబంధించి నిరుపేదలకు హక్కులు కల్పించే విషయమై సమాలోచనలు చేస్తోంది. ఈ భూములపై లబ్ధిదారులకు హక్కులు కల్పించడానికి ఉన్న అవకాశాలేంటి? కల్పిస్తే జరిగే పరిణామాలేంటి?

హ­క్కు­లు ఇవ్వడం ద్వారా పేదల నుంచి భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం తీసుకోగలిగిన చర్యలేమైనా ఉన్నాయా? లబ్ధిదారుల నుంచి ఇప్పటి­కే ఇతరుల చేతుల్లోకి వెళ్లిన భూములను ఏం చేయాలి? వీలున్నచోట్ల అసైన్డ్‌ భూములను ప్రభుత్వమే కొనుగోలు చేసే అవకాశముందా? అనే అంశాలపై ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తున్నట్టు సమాచారం.

అయితే, ఏది చేయాలన్నా తెలంగాణ అసై­న్డ్‌ భూముల బదలాయింపు నిషేధచట్టం–1977 (పీవోటీ యాక్ట్‌)కు కచ్చితంగా సవరణ చేయా­ల్సి ఉన్నందున డిసెంబర్‌లో నిర్వహించే శీతాకాల లేదంటే బడ్జెట్‌ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు పెట్టే అవకాశముందని తెలుస్తోంది. 

ఆర్థిక భరోసా వచ్చేనా..?
వాస్తవానికి, గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని వ్యవసాయ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వవర్గాల కథనం ప్రకారం ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఎకరం భూమి 15–20 లక్షలు పలుకుతోంది. డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో ఎకరా కోట్లు పలుకుతుంటే రాజధాని శివార్లలో పదుల కోట్లు దాటుతోంది.

ఈ నేపథ్యంలో ఆ భూములను అనుభవించే వీలులేకుండా కేవలం సాగు హక్కులు కల్పించడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకుతున్న పేదలు వారి అవసరాలకు వాటిని ఇతరులకు అమ్ముకోగలిగితే కొంత ఆర్థిక భరోసా వస్తుందనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా పలుమార్లు రాష్ట్రంలోని అసైన్డ్‌ భూముల పరిస్థితిపై ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంది.

అసైన్డ్‌ భూములు అసైనీల చేతుల్లోనే ఉన్నాయా? అన్యాక్రాంతమైన భూములెన్ని? అసైనీల దగ్గరి నుంచి కొనుగోలు చేసిన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులేంటి? అన్నదానిపై రెవెన్యూ వర్గాలు ప్రభుత్వానికి వివరాలు పంపాయి. ఈ వివరాల ప్రకారం దాదాపు 40 శాతం భూములు అసైనీల చేతుల్లో లేవని సమాచారం. ఈ నేపథ్యంలో అన్యాక్రాంతమైన భూములను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. 
1/70 చట్టం తరహాలో...
రాజధాని శివార్లలోని అసైన్డ్‌ భూములకు పరిహారం ఇవ్వడం(కొనుగోలు చేయడం) ద్వారా ఆ భూములను సొంతం చేసుకుని వాటిని వేలం వేయాలనే ప్రతిపాదన గతంలోనే ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ మేరకు శంషాబాద్‌సహా కొన్ని మండలాల్లోని అసైన్డ్‌ భూముల కొనుగోలు, అమ్మకాలపై ప్రభుత్వం వద్ద నివేదిక కూడా ఉంది. దీనికితోడు అసైన్డ్‌ భూములను ప్రభుత్వమే కొనుగోలు చేసే వెసులుబాటు కూడా ఉంది.

కేంద్ర ప్రభుత్వపరిధిలోని 1/70 చట్టం ప్రకారం(అటవీ చట్టం) గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూములుంటే వాటిని కేవలం గిరిజనులకు మాత్రమే అమ్మాలి. కొనేందుకు గిరిజనులెవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయవచ్చు. ఈ వెసులుబాటు ఆధారంగానే రాష్ట్రంలోని అసైన్డ్‌ భూములను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి.

అయితే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని భూములను కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై న్యాయనిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. మొత్తం మీద అసైన్డ్‌ భూములకు హక్కులు కల్పించే విషయంలో అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. 

అన్నీ క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే... 
గత కొన్నేళ్ల పరిణామాలను చూస్తే దేశవ్యాప్తంగా భూముల అమ్మకాలు, కొనుగోళ్ల మీద ఆంక్షలన్నింటినీ సడలించుకుంటూ వస్తున్నాం. 2004లో ప్రపంచ బ్యాంకు తయారు చేసిన నివేదిక కూడా ఆంక్షలను తొలగించాలని, భూక్రయ, విక్రయ లావాదేవీలు సులభతరం చేయాలని ప్రతిపాదించింది. ‘ల్యాండ్‌ పాలసీస్‌ ఫర్‌ గ్రోత్‌ అండ్‌ పావర్టీ రిడక్షన్‌’ పేరిట భారతదేశం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన నివేదిక ఇది. ఆర్థిక సరళీకరణ సూత్రం మార్కెట్‌లో భూలావాదేవీలు సులభతరంగా ఉండాలని చెబుతోంది.

మనం వద్దనుకున్నా, కావాలనుకున్నా ఆంక్షలు ఎత్తివేయడమే మన ముందున్న మార్గం. అయితే, ఆంక్షలు ఎత్తివేసే సమయంలో ఎవరి రక్షణ కోసం చట్టాలు చేశామో వారు నష్టపోకుండా చూసుకోవాలి. ఈ పరిస్థితుల్లో పేదల భూములపై కొంతమేరకు ఆంక్షల సడలింపు అవసరం. అసైన్డ్‌ భూములను ప్రభుత్వం కొనుగోలు చేసే అంశం లేదా ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు కొనుగోలు చేయాలన్న కోనేరు రంగారావు నివేదికను పరిశీలించాలి. లేదంటే కొంత కాలపరిమితికి అమ్ముకునే అవకాశమివ్వాలి. అలా అమ్ముకునే సమయంలో కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఆ భూమిపై హక్కులు బదలాయించాలి.
–భూమి సునీల్, భూచట్టాల నిపుణుడు, నల్సార్‌ విశ్వవిద్యాలయ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 

స్ఫూర్తికి విఘాతం కలిగితే..!
తెలంగాణలో దాదాపు 15 లక్షల మందికిపైగా పేదలకు 24 లక్షల ఎకరాలను అసైన్‌ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఈ భూములపై సదరు పేదలకు హక్కు ఉండదు. కేవలం సాగు మాత్రమే చేసుకోవాలి. ఇతరులకు అమ్మడం ద్వారా అసైనీలు వారి హక్కులను బదలాయించే వెసులుబాటు లేదు. పొరుగునే ఉన్న కర్ణాటకలో అసైన్‌ చేసిన 20 ఏళ్ల తర్వాత అమ్ముకునే అవకాశముంది. మనరాష్ట్రంలో ఆ హక్కులు కల్పిస్తే బడుగుల చేతుల్లో ఉన్న ఆ కొద్ది భూమి ధనవంతులు, భూస్వాముల చేతుల్లోకి వెళ్లిపోతుందని, తద్వారా అసైన్డ్‌ స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని, రాష్ట్రంలో భూముల్లేని పేదలసంఖ్య పెరిగిపోతుందనే వాదన ఉంది. ఈ వాదనను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని తెలుస్తోంది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top