
సాక్షి, హైదరాబాద్: అకాలవర్షం అన్నదాతను నిలువెల్లా ముంచింది. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలులు, భారీ వర్షానికి పొలాల్లో ఉన్న వరి నేలకొరగగా.. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసిన ధాన్యం తడిసి, కొట్టుకుపోయింది. ఈసారి అంతంత మాత్రంగానే దిగుబడి వచ్చిన మామిడితోపాటు నువ్వులు, మొక్కజొన్న వంటి పంటలూ దెబ్బతిన్నాయి. రాష్ట్రం లోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, యాదాద్రి, నల్లగొండ, మంచి ర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, జనగాం, వరంగల్, మెదక్ తదితర జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. ఒక్క యాదాద్రి జిల్లాలోనే 50 వేల టన్నుల ధాన్యం తడిసిపోయినట్టు వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉండగా.. ధాన్యాన్ని ఏం చేయాలో తోచని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
అర్ధరాత్రి తర్వాత మొదలై..
మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రంగా ఉండటం, రాత్రికూడా మబ్బుపట్టడం వంటివేమీ లేకపోవడంతో.. వర్షం కురుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒక్కసారిగా వాన మొదలైంది. కొన్నిచోట్ల ఉదయం 7 గంటల వరకూ కొనసాగింది. కప్పడానికి టార్పాలిన్లు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలను తెరవనిచోట్ల రైతులు ధాన్యాన్ని రోడ్లపై, కల్లాల్లో ఆరబోశారు. దీనితో చాలాచోట్ల ధాన్యం కొట్టుకుపోయింది.
కొనుగోళ్లు.. ఏర్పాట్లు.. లేక
యాసంగి పంట కొనుగోళ్ల కోసం 6,500 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 3,525 కేంద్రాలను అధికారికంగా ప్రారంభించారు. చాలాచోట్ల కొనుగోళ్లు మొదలేకాలేదు. ఇప్పటివరకు 55,553 మంది రైతుల నుంచి 4.21 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. హమాలీల కొరత, మిల్లర్ల కొర్రీలు, ఎఫ్‌సీఐ తనిఖీలు తదితర కారణాలతో కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోందని అధికారులు అంటున్నారు. నిజానికి సెగలు కక్కుతున్న ఎండల వల్ల కోతలు పూర్తయిన రెండు రోజుల్లోనే ధాన్యంలోని తేమ ఆరిపోతోంది. అయినా ఏదో ఓ కారణం చూపుతూ ధాన్యం కాంటా వేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది ఇదే సమయానికి 10లక్షల టన్నులకుపైగా కొనుగోలు అయిందని.. ఈసారి సగం కూడా కాలేదని రైతులు గుర్తు చేస్తున్నారు. కేంద్రాలకు ధాన్యం తెచ్చినా కొనుగోళ్లు లేక అకాల వర్షానికి నష్టపోవలసి వచ్చిందని వాపోతున్నారు.
టార్పాలిన్లు కూడా లేవు
అకాల వర్షాలు పడితే ధాన్యంపై కప్పడానికి అవసరమైన టార్పాలిన్లను ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయలేదు. పౌరసరఫరాల శాఖ అధికారులు గతంలో ఉన్న వాటినే కొన్నిచోట్ల అందుబాటులో ఉంచారు. మరికొన్ని చోట్ల రైతులే పాత ఎరువుల బస్తాలతో కుట్టిన కవర్లనే ధాన్యంపై కప్పుకొన్నారు. అవి వాననీటిని ఆపలేకపోయాయి. పలుచోట్ల నీటి వరద కాల్వల్లా ప్రవహించి.. ధాన్యం కొట్టుకుపోయింది.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ధాన్యానికి కవర్ కప్పుతుండగా పిడుగుపడి పోచయ్య అనే రైతు మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మోదినిగూడెంలో పిడుగుపాటుకు పగడాల లింగరాజు (26) అనే గొర్రెల కాపరి మృతిచెందాడు. కేతేపల్లిలో వానకు నీరు కారుతుండటంతో ఇంటి పైకప్పు రేకులపై టార్పాలిన్ కప్పేందుకు వెళ్లిన ముదిరెడ్డి వీరారెడ్డి (49) రేకులు విరిగిపడి చనిపోయాడు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేటలో రైతు సిద్ధం వెంకటేష్ (47) ఇంటి డాబాపై ఆరబోసిన ధాన్యం మీద టార్పాలిన్ కప్పడానికి వెళ్లి.. ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో గేదెలు, ఎడ్లు, గొర్రెలు పిడుగుపాటుకు చనిపోయాయి.
టార్పాలిన్లు అందుబాటులో ఉంచాం
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఒక్కరోజులోనే ఆరిపోతుంది. దాన్ని కొనుగోలు చేయొచ్చు. బాగా నానిపోతే, కొట్టుకుపోతేనే ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కాంటా వేయాలని ఆదేశాలు ఇచ్చాం. రాష్ట్రంలోని 5,100 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని కేంద్రాలకు టార్పాలిన్లు సమకూర్చాలని కూడా ఆదేశించాం. వ్యవసాయశాఖ అకాల వర్షం నష్టాన్ని అంచనా వేసేపనిలో ఉంది.
– గంగుల కమలాకర్ , పౌరసరఫరాల శాఖ మంత్రి
ఎక్కడ చూసినా నష్టమే..
– జగిత్యాల జిల్లాలో 2,340 ఎకరాల్లో వరి, నువ్వులు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 6 వేల ఎకరాల్లో మామిడితోటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనాలు వేశారు. సారంగాపూర్ మండలం బట్టపల్లిలో మర్రిపల్లి లింగయ్య అనే రైతు ధాన్యం మొత్తం వరదలో కొట్టుకుపోయి బావిలో పడింది.
– పెద్దపల్లి జిల్లాలో 1,256 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని కొనుగోలు కేంద్రంలో భారీగా ధాన్యం కొట్టుకుపోయింది. ఆరు ట్రాక్టర్ల ధాన్యం తెస్తే.. 3 ట్రాక్టర్ల మేర కొట్టుకుపోయిందని మీసాల శ్రీను అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
– కరీంనగర్ జిల్లా శంకరపట్నం, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల్లో వరికి నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో 10 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది.
– టార్పాలిన్లు లేక మంచిర్యాల జిల్లాలోని 25 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. జిల్లావ్యాప్తంగా 2,626 మంది రైతులకు చెందిన 4,953 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది.
– నల్లగొండ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు కూడా నీట మునిగాయి. «20 వేల టన్నుల ధాన్యం తడిచిపోయింది.
– యాదాద్రి భువనగిరి జిల్లాలో వలిగొండ, భువనగిరి, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి, మోత్కూరు, ఆత్మకూర్‌ఎం, రాజాపేట, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, గుండాల, రామన్నపేట, అడ్డగూడూరు, తుర్కపల్లి, ఆలేరు మండలాల్లో 15 వేల ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. కుప్పలు వేసిన ధాన్యం భారీగా కొట్టుకుపోయింది. 3 వేల ఎకరాల్లో వరి నేలకొరిగింది. 100 ఎకరాల్లో మామిడి నేల రాలింది.
– మెదక్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షానికి వరి ధాన్యం నీటమునగడంతోపాటు మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది. కొనుగోలు కేంద్రాల్లోకి నీరు చేరి ధాన్యం తడిసిపోయింది.
సగం దిగుబడి తడిసిపోయి..
సిద్దిపేట మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని ఎత్తుకుంటున్న ఈ రైతు పేరు దుప్పటి దర్గయ్య. సిద్దిపేట జిల్లా లింగారెడ్డిపల్లికి చెందిన ఈయన రెండెకరాల్లో వరివేస్తే 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దాన్ని సిద్దిపేట మార్కెట్‌కు తెచ్చానని.. వానకు 20 క్వింటాళ్ల మేర తడిసిపోయిందని దర్గయ్య వాపోయాడు. టార్పాలిన్ కప్పినా కింద వడ్లు తడిశాయని.. తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
ధాన్యమంతా కొట్టుకుపోయి..
వానకు ధాన్యం నీటి పాలవడంతో రోదిస్తున్న ఈ మహిళా రైతు పేరు చాట్ల మమత. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నానికి చెందిన ఆమె భర్త గురువయ్య కలిసి రెండెకరాల్లో వరి వేశారు. రూ.40వేలదాకా పెట్టుబడి పెట్టారు. వారం క్రితం పంట కోసి రాయపట్నంలోని కొనుగోలు కేంద్రానికి 30 క్వింటాళ్ల ధాన్యం తెచ్చారు. రూ.60 వేలదాకా ఆదాయం వస్తుందని ఆశించారు. కానీ తేమ ఎక్కువగా ఉందంటూ నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయలేదు. బుధవారం తెల్లవారుజామున భారీ వాన పడటంతో ధాన్యం కొట్టుకుపోయింది.
టార్పాలిన్లు ఇవ్వలేదు
పంటను అమ్మేందుకు కొనుగోలు కేంద్రానికి తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా వేయలేదు. తేమ ఎక్కువగా ఉందని ఒకసారి, ఆన్‌లైన్ కాలేదని మరోసారి ఆపారు. టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవు. ఇంటి నుంచి తెచ్చుకున్న ప్లాస్టిక్ కవర్లు కప్పుతున్నాం. అయినా రాత్రి కురిసిన వానతో ధాన్యం తడిసింది.
– కాల్వల తిరుపతి, ధర్మారం