ఆ గ్రామం.. కోట్ల ఏళ్లుగా సజీవం

Specialties And Interesting Storys About Rajaram Village In Mancherial District - Sakshi

డైనోసార్ల ఆనవాళ్ల నుంచి రాజవంశాల జాడలదాకా.. 

మంచిర్యాల జిల్లాలోని రాజారాం గ్రామ ప్రత్యేకతలెన్నో..

సాక్షి, హైదరాబాద్‌: ఆ ప్రాంతంలో.. కోట్ల ఏళ్ల క్రితం డైనోసార్లు వేటాడాయి.. లక్షల ఏళ్ల నాడు రకరకాల జీవజాతులు విహరించాయి.. వేల ఏళ్ల నాడు ఆది మానవుల సమూహాలు మసిలాయి.. వందల ఏళ్ల కింద వివిధ సామ్రాజ్యాల పాలనలో కళాసృష్టి కొత్తపుంతలు తొక్కింది.. ఒకేచోట కోట్ల ఏళ్ల జీవ పరిణామక్రమం జాడలు పదిలంగా ఉండటం అద్భుతం. ఆ ప్రాంతమే.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని రాజారాం గ్రామం. 


చాళుక్యుల హయాంలో రూపొందిన భారీ శిల్పం

హైదరాబాద్‌ ఆదర్శ్‌నగర్‌లోని బిర్లా సైన్స్‌ సెంటర్‌కు వెళ్తే.. ఓ భారీ రాక్షసబల్లి అస్థి పంజరం కనిపిస్తుంది. దాదాపు 16 కోట్ల ఏళ్లకిందటి ఆ డైనోసార్‌ శిలాజాన్ని రాజారాం గ్రామ శివార్లలోని అడవిలోనే గుర్తించారు. 1970–1988 ఏళ్ల మధ్య జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) శాస్త్రవేత్త యాదగిరి ఈ ప్రాంతంలో పరిశోధనలు చేశారు. ఆ సమయంలో ‘కోటసారస్‌’గా పిలిచే డైనోసార్ల శిలాజాలను గుర్తించారు. వాటన్నింటినీ ఒకచోటికి చేర్చి పూర్తిస్థాయి రాక్షస బల్లి అస్థిపంజరానికి రూపమిచ్చారు. ఆ తర్వాత దండకోసారస్‌ థెరోపాడ్‌ జాతి రాక్షసబల్లి శిలాజాలను కూడా ఈ అడవిలో గుర్తించారు. 


చేప శిలాజం

డైనోసార్ల తదుపరి కాలానికి చెందిన కొన్నిరకాల చేపజాతుల శిలాజాలను కూడా రాజారాం అటవీ ప్రాంతంలో గుర్తించారు. ప్రస్తుతం అవి కరీంనగర్‌ పురావస్తు పరిశోధనశాలలో ఉన్నాయి. ఆరున్నర కోట్ల ఏళ్లనాటి వృక్షాల శిలాజాలు కూడా ఈ అడవిలో గుర్తించారు. 


ఆదిమానవుల పనిముట్టు

తర్వాత మానవ పరిణామక్రమానికి సంబంధించిన జాడలు ఈ ఊరి చుట్టూ లభించాయి. వివిధ కాలాలకు చెందిన ఆదిమానవులు వినియోగించిన రాతి పనిముట్లు పెద్ద సంఖ్యలో దొరికాయి. 


శాతవాహనకాలం నాటి ఇటుకలు

రాజారాం నుంచి వేమనపల్లి వెళ్లేదారిలో ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్న పొలాల్లో.. శాతవాహన కాలానికి చెందిన కాల్చిన రాతి ఇటుకలు, మట్టి పాత్రలు వెలుగుచూశాయి. అవి రెండో శతాబ్ధం నాటివిగా అంచనా వేశారు. ఇక గ్రామ శివార్లలో పోచమ్మ ఆలయంగా భావిస్తున్న మందిరం సమీపంలో పెద్దపెద్ద దేవతాశిల్పాలు పడి ఉన్నాయి. అవి చాళుక్యుల కాలానివిగా గుర్తించారు. ఇవే కాదు.. మరెన్నో పురాతన, చారిత్రక ఆనవాళ్లు ఈ గ్రామం చుట్టూ బయటపడ్డాయి. దీంతో చరిత్ర పరిశోధకులకు ఈ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పురాతన శిలాజాలకు నిలయం
‘ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పల్లెటూర్లు, వాటి చుట్టూ ఉన్న దట్టమైన అడవులు.. ఎన్నో చారిత్రక ప్రత్యేకతలకు నిలయాలు. అందులో వేమనపల్లి ప్రాంతం పురాతన శిలాజాలకు నిలయంగా ఉంది. రాక్షస బల్లులు ఈ ప్రాంతంలో సంచరించిన ఆనవాళ్లు ఎన్నో లభించాయి. వాటితోపాటు ఆదిమానవుల నుంచి శాతవాహనులు, చాళుక్యులు, ఇటీవలి రాజవంశాల దాకా ఎన్నో ఆనవాళ్లకు రాజారాం నిలయంగా మారింది’
– సముద్రాల సునీల్, ఔత్సాహిక పరిశోధకుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top