
విజయ దశమి నాటికి వందేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంటున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
వందేళ్ల ఆరెస్సెస్ ప్రయాణంలో ఒడిదుడుకులు, సవాళ్లు, సమాజ సేవ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వందేళ్ల చరిత్రలో నిషేధాలు, ప్రతిబంధకాలు, వివాదాలు ఎన్నో ఎదురైనప్పటికీ, ప్రతి దశలో తన శ్రేణులను విస్తరించుకుంటూ ముందుకెళ్లింది. హిందూ సమాజాన్ని సంఘటితం చేసి, జాతీయ పునరుజ్జీవానికి దారితీసేలా కృషి చేసేందుకు ఇది ఏర్పాటైంది. యుద్ధాలు, ఎమర్జెన్సీ, రామజన్మభూమి ఉద్యమం వంటి కీలక దశల్లో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర దేశ రాజకీయ, సామాజిక మార్పులను ప్రభావితం చేసిందనే అభిప్రాయాన్ని చరిత్రకారులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రారంభంలో చిన్న వలంటీర్ బృందంగా ఏర్పడి, దేశంలోని అతిపెద్ద సామాజిక సంస్థగా ఎదిగింది. గాంధీజీ హత్య తరువాత వచ్చిన ప్రతికూలత, అత్యవసర పరిస్థితి సమయంలో ఎదుర్కొన్న అడ్డంకులు, అయోధ్య ఉద్యమం వంటి దశలు సంఘానికి మలుపుతిప్పే సంఘటనలుగా నిలిచాయి. ప్రస్తు తం ఆర్‌ఎస్‌ఎస్ లక్షలాది శాఖలతో సమాజంలో తన సిద్ధాంతాలను విస్తరించి, రాజకీయ, సామా జిక, సాంస్కృతిక రంగాల్లో ప్రభావం చూపుతోంది.
బ్రిటిష్ వలస పాలనలో హిందూ సమాజాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో హెడ్గేవార్ ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రారంభించారు. మొదట్లో బ్రాహ్మ ణులు, యువకులు పాల్గొన్నారు. 1930లలో శాఖలు (స్వయం సేవకుల సమావేశాలు) విస్తరించాయి. 1940లో మాధవరావ్ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) సర్‌సంఘచాలక్‌గా నియమితులై, ‘బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకంతో హిందూత్వ భావనను మరింత బలపరిచారు.
అంకురార్పణ ఇలా...
1925లో విజయదశమి నాడు...ప్రథమ సర్‌సంఘచాలక్ హెడ్గేవార్ ఇంటి వద్ద 17 మందితో జరిగిన సమావేశంలో ఈ సంస్థని ప్రకటించారు. ఈ సమావేశంలో హెడ్గేవార్‌తో పాటు విశ్వనాథ్ కేల్కర్, భావ్‌జీ గావ్‌రే, అన్నా సహా, బాలాజీ ఉద్దార్, బాపూరావ్ భేది వంటివారు ఉన్నారు. ఆ రోజుల్లో కేవలం హిందువులని ఏకం చేయాలన్నది ఒక్కటే ఆశయం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే పేరు సైతం 1926 ఏప్రిల్ 17న నిర్ణయించారు. అదేరోజున హెడ్గేవార్‌ని సంఘ్ ప్రముఖ్‌గా ఎన్నుకున్నారు.
కానీ సర్‌సంఘచాలక్‌గా ఆయనను 1929 నవంబర్‌లో నియమించారు. ముందుగా మూడు పేర్లపై...రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, జరీ పట్కా మండల్ ఇంకా భారతోద్ధారక మండళ్లపై చర్చించారు. మొత్తం 26 మంది సభ్యుల్లో నుంచి 20 మంది సభ్యులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కే ఓటు వేశారు. వ్యాయామశాలలు ఇంకా అఖాడాల ద్వారా హెడ్గేవార్ సంఘ కార్యక్రమాలను ముందుకు నడిపించారు.
ఆధ్యాత్మిక రంగంలో విశ్వహిందూ పరిషత్, విద్యా రంగంలో ఏబీవీపీ, కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్, వ్యవసాయ రంగంలో భారతీయ కిసాన్ సంఘ్, వనవాసుల కోసం వనవాసీ కళ్యాణ అశ్రమ్, సేవారంగంలో సేవాభారతి, ఆరోగ్యం కోసం సక్షమ్, ఆరోగ్యభారతి, సహకార రంగం కోసం సహకార భారతి, స్వదేశీని ప్రోత్సహించేందుకు స్వదేశీ జాగరణ్ మంచ్, న్యాయం కోసం అధివక్త పరిషత్, ఉద్యోగుల కోసం లఘు ఉద్యోగ్ భారతి, క్రీడా రంగం కోసం క్రీడా భారతి, సాహిత్య రంగంలో సాహిత్య పరిషత్, సంస్కృత భారతి, వినియోగదారుల కోసం గ్రాహక్ పంచాయత్ ఇలా ప్రతి రంగంలోనూ విస్తరించాయి.
తెలుగునాట ఒకటిన్నర దశాబ్దం తరువాతే
» ఆవిర్భవించిన ఒకటిన్నర దశాబ్దానికి గాని తెలుగు ప్రాంతాలకు ఆర్‌ఎస్‌ఎస్ విస్తరించలేదు. మళ్లీ ఆనాటి మత, రాజకీయ పరిస్థితులు, ఆంధ్ర ప్రాంతంలో 1946 కాస్త ముందు, పదేళ్ల తరువాత నిజాం ప్రాంతానికి ఆర్‌ఎస్‌ఎస్ వచ్చింది. 1940 ముందు రాజమండ్రిలో శాఖ కార్యక్రమం ప్రారంభమయింది. షేవర్ మిల్లులో పనిచేసే కొందరు మరాఠీలు శాఖ నడిపే యత్నం చేశారని వెల్లడైంది.
విశాఖలోనూ ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. మొదటి శిక్షణ శిబిరం 1942ల్నో గుంటూరు సమీపంలోని నల్లపాడులో 100 మందితో నిర్వహించగలిగారు. రెండవది గోరంట్లలోను, మూడోది విజయవాడలోను నిర్వహించారు. 1948, జనవరిలో విజయవాడలో భారీ శిక్షణ శిబిరానికి ఏర్పాట్లు జరిగాయి.
» నిజాం ప్రాంతంలో కూడా పీఎల్ దేశ్‌ముఖ్ గోపాల్‌రావు ఠాకూర్ల ఆధ్వర్యంలోనే ఆర్‌ఎస్‌ఎస్ విస్తరించింది. 1950 ప్రాంతంలో వరంగల్, సికింద్రాబాద్, హైదరాబాద్‌లో కార్యకలాపాలు మొదలయ్యాయి. రామ్ధార్ షా, రామ్ పార్టేకర్, రామమూర్తి వంటివారు పని చేశారు.
» 1960లో శ్రీశైలంలోను, 1963లో హైదరాబాద్‌లో శిబిరాలు నిర్వహించారు. ఇవి విస్తృతంగా జరిగాయి. సోమేపల్లి సోమయ్య, పిన్నమనేని లింగయ్య చౌదరి వంటివారు ఆనాడు విశేషంగా సంఘ విస్తరణకు కృషి చేశారు
» ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 73,500 శాఖలు ఉన్నాయని, నిత్యశాఖలకు హాజరయ్యే వారు వారాంతపు శాఖలకు హాజరయ్యేవారు దాదాపు 40 లక్షలని అంచనా. అయితే ఆర్‌ఎస్‌ఎస్ సభ్యత్వం అని ఏమీ ఉండదు. భారతీయ మూలాలను అంగీకరించే వారు ఎవరైనా శాఖకు రావచ్చునని ఆర్‌ఎస్‌ఎస్ చెబుతుంది.
» ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో... 1940లలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రవేశించింది. 1956 తర్వాత విస్తరించింది. 1940లలో హైదరాబాద్‌లో మొదటి శాఖలు. 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత హైద రాబాద్, వరంగల్‌లో విస్తరణ. 1969 తెలంగాణ ఉద్యమం సమయంలో హిందూత్వ ప్రచారం. 1977 దీవిసీమ తుఫాను సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల విస్తృత సేవలు.
» ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 1,100 శాఖలు, 75,000 స్వయం సేవకులు ఉన్నారు. 1953 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాత విజయవాడ, రాజమహేంద్రవరం, శ్రీకాకుళంలలో శాఖలు. 1952లో సరస్వతి శిశు మందిర్ పాఠశాలలు ప్రారంభం. 1977 తుఫానులో స్వయం సేవకులు 35,000 మంది సేవలు. 1980లలో విజయవాడ, అనంతపురం, విశాఖపట్నంలో విస్తరణ.
» ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తు చేసుకోవాలి. సంఘ్ వ్యవస్థాపకులైన డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకులు తెలంగాణలోని ఇందూరు జిల్లా కందకుర్తి గ్రామానికి చెందినవారు.
1963లో సంఘ్‌లో చేరిన నేను 1970 నుంచి (55 ఏళ్లుగా) ఆరెస్సెస్ ప్రచారక్‌గా కొనసాగుతున్నాను. ప్రారంభం నుంచి మాతృభూమిపట్ల భక్తి, ప్రేమ, సమాజం పట్ల సంవేదన, ఆత్మీయత జాతీయ భావాలు ప్రేరణగా మేమంతా చేరాము. అంతకు ముందు స్వామి వివేకానంద ఆలోచనలు స్ఫూర్తిని నింపితే సంఘ్ వాటినే సమ్మిళితం చేసుకుని ముందుకు సాగింది. రోజువారీ సంఘ్ నిర్వహించే శాఖల ద్వారా సంవేదన, సంఘటిత సామర్థ్యం, సమాజంతో కలిసి నడవడం వంటివి అలవడుతున్నాయి.
హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మా శాఖకు ముఖ్యసూచిగా నాకంటే ఒక ఏడాది సీనియర్. మా అన్నయ్య ఆయనకు సీనియర్. తర్వాత ఉమ్మడి ఏపీలో విశాఖలో పదేళ్లు, విజయవాడలో 23 ఏళ్లు, హైదరాబాద్‌లో ఐదేళ్లు, బెంగళూరులో ఆరేళ్లు, పశ్చిమబెంగాల్‌లో 12 ఏళ్లు, గత మూడేళ్లుగా గువాహతి కేంద్రంగా అస్సాంలో పనిచేస్తున్నాను. దేశవ్యాప్తంగా అనేక బాధ్యతలు నిర్వహించిన సందర్భంగా దేశ ప్రజల్లో ఏకాత్మత అనేది కనిపించింది. ఈ విధంగా జాతీయత ఆధారంగా అసంఘటిత శక్తి నిర్మాణమైంది.
ఎమర్జెన్సీలో 13 నెలలు అండర్‌గ్రౌండ్‌లో ఉండి ఆ తర్వాత మీసా కింద అరెస్ట్ అయ్యి ఆరునెలలు జైళ్లో ఉన్నాను. ఎమర్జెన్సీ తర్వాత సేవా కార్యక్రమాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం గ్రామ వికాసం, సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, పౌరవిధులు, స్వదేశీ భావాల వ్యాప్తి తదితరాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌లో ఓ పెద్దశక్తిగా సంఘ్ పనిచేస్తోంది.
వ్యక్తిగత, కుటుంబస్థాయిలలో సామాజిక పరివర్తన కోసం కృషి సాగుతోంది. జాతీయత, హిందుత్వం ఆధారంగా...‘వర్కింగ్ టుగెదర్ సెపరేట్లీ’ అనే నినాదంతో కూడా ముందుకెళుతున్నాము. మతం ఆధారంగా కాకుండా జాతీయత, మాతృభూమి ఆధారంగా సమాజనిర్మాణం జరుగుతుందని వ్యవస్థాపకులు హెడ్గేవార్ నుంచి సంఘ్ నమ్ముతోంది. – భాగయ్య, అఖిల భారత కార్యకారిణి సభ్యులు, ఆర్‌ఎస్‌ఎస్
ఇదీ వందేళ్ల పరిణామక్రమం...
» 1925లో నాగపూర్‌లో కేశవ్ బాలీరామ్ హెడ్గేవర్ ఆధ్వర్యంలో స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్), ఆరంభంలో ఒక చిన్న వలంటీర్ సంఘంగా మొదలై, ఆ తరువాత దేశవ్యాప్తంగా ప్రభావం చూపిన పెద్ద సామాజిక–రాజకీయ శక్తిగా ఎదిగింది
» 1930లలో ఆర్‌ఎస్‌ఎస్ తన శాఖల రూపంలో విస్తరణ
» 1939లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కూడా వీటి ద్వారా యువతను శారీరక–మానసికంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది
» 1940లో మహారాజ్ భగవత్ వంటి నేతలు సంఘ విస్తరణలో ప్రధాన పాత్ర పోషించారు
» 1947–1950: స్వాతంత్య్రం తర్వాత కాలం
» మహాత్మాగాంధీ హత్య (1948) తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధింపు (మొదటిసారి నిషేధం)
» అనంతరం కొత్త రాజ్యాంగానికి లోబడి సంఘాన్ని కొనసాగించేందుకు ప్రతిజ్ఞ, తద్వారా నిషేధం ఎత్తివేత
» 1950–1960 దశకంలో సంఘ్ సేవా కార్యక్రమాలు విస్తరణ
» 1960–63 మధ్య చైనా యుద్ధం నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు దేశ సేవలో పాల్గొన్నారు
»1965 ఇండో–పాక్ యుద్ధ సమయంలో కూడా ఆర్‌ఎస్‌ఎస్ సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.
» 1975–77: అత్యవసర పరిస్థితి
» ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై మళ్లీ నిషేధం (రెండోసారి నిషేధం–వేలాది మంది స్వయంసేవకులు జైలు జీవితం
» 1980–1990...మొదట జనసంఘ్, తరువాత బీజేపీలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావం పెరుగుదల
» 1992లో అయోధ్య రామజన్మభూమి ఉద్యమం సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక పాత్ర పోషించింది
» 1992లో బాబ్రీమసీదు కూలిన సందర్భంగా మూడోసారి నిషేధం
» 2000ల నుంచి ఇప్పటివరకు...విద్య, ఆరోగ్యం, గ్రామాభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో ఆర్‌ఎస్‌ఎస్ విస్తృత కార్యకలాపాలు కొనసాగిస్తోంది
» దేశ రాజకీయాల్లోనూ, ప్రత్యేకించి రాజకీయంగా బీజేపీ ఎదుగుదలలో ఆర్‌ఎస్‌ఎస్ కీలకపాత్ర
» 2020–21 – కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా సహాయక చర్యలు
» 2022–75వ స్వాతంత్య్ర వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్ శాఖల ప్రత్యేక కార్యక్రమాలు
» 2025 – ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది దిశగా అడుగులు. 100 ఏళ్ల పూర్తి వేడుకల కోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు