
భైంసా మండలంలో నీటమునిగిన సోయా పంట
వర్షాలు, వరదలతో 2.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం
వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా
కామారెడ్డి, మెదక్, తదితర జిల్లాల్లో పంటల మునక
పొలాల్లో ఇసుక మేటలు.. మంత్రి తుమ్మల సమీక్ష
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి
సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దాదాపు 2.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాల వరకు నష్టం వాటిల్లగా, మెదక్, నిజామాబాద్, భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో జరిగిన నష్టంపై ప్రాథమిక వివరాలను అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు.
కామారెడ్డి, మెదక్‌లో అపార నష్టం
క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారం ప్రకారం.. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునగడం, ఇసుక మేటలు వేయడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, ఎల్లారెడ్డి, రామారెడ్డి మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే జుక్కల్ నియోజక వర్గంలోని పిట్లం, పెద్దకొడప్‌గల్, మహ్మద్‌నగర్, నిజాంసాగర్, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి.
ఇక కామారెడ్డి నియోజక వర్గంలోని కామారెడ్డి, భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట మండలాల్లో, అలాగే బాన్సువాడలో పంటలు నీట మునిగాయి. మెదక్ జిల్లాలో ఇసుక మేటలు వేసి పంట చేతికందకుండా పోయింది. భారీగా వరద నీరు చేరడంతో పంట చేనులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు.
ప్రధానంగా వరి, పత్తి, చెరుకు పంటలకు నష్టం వాటిల్లింది. నార్సింగి జాతీయ రహదారి పక్కన ఉన్న గన్నేరు వాగుకు వరద పోటెత్తడంతో పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లా భైంసా మండలం సిరాల ప్రాజెక్టు అలుగు వరదతో సిరాల, దేగాం గ్రామాల్లో పత్తి, సోయా పంటలు నీటమునిగాయి. శ్రీరాంసాగర్ అవుట్ ఫ్లో వరద కారణంగా లక్ష్మణచాంద, ఖానాపూర్, దస్తురాబాద్ మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
మండలాల వారీగా వివరాలు సేకరించండి: మంత్రి
శుక్రవారం అధికారులతో సమావేశమైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మండలాల వారీగా జరిగిన నష్టం వివరాలను సేకరించి, సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయని, అధికారులు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటించి, పంటనష్టంపై సమగ్ర నివేదిక తయారుచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. గోదావరి వరద ప్రవాహ ఉధృతి పెరగడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడం జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారిని ఆదేశించారు.
త్వరలో 21,325 మెట్రిక్ టన్నుల యూరియా
రామగుండం ఎరువుల పరిశ్రమ (ఆర్‌ఎఫ్‌సీఎల్)లో యూరియా ఉత్పత్తి నిలిచి పోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని తుమ్మల తెలిపారు. రానున్న రెండురోజుల్లో రాష్ట్రానికి వివిధ కంపెనీల నుంచి 21,325 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని వెల్లడించారు. కాగా,సెపె్టంబర్ ఎరువుల కోటాను బకాయితో కలిపి వెంటనే విడుదల చేయాలని మరోసారి కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఆయన లేఖ రాశారు.