Agnipath scheme : అగ్గి పథం

Protests At Secunderabad Railway Station For Agnipath Scheme - Sakshi

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అభ్యర్థుల విధ్వంసం

కేంద్రం తెచ్చిన ‘అగ్నిపథ్‌’పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆందోళన 

త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ కోసం కేంద్రం తెచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకం రాష్ట్రంలోనూ అగ్గి పుట్టించింది. ఆర్మీలో చేరేందుకు సిద్ధమవుతున్నవారు, పాత రిక్రూట్‌మెంట్లలో వివిధ దశలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కలకలం రేపారు. మొదట రైల్‌రోకో నిరసనగా మొదలుపెట్టినా ఆర్పీఎఫ్‌ పోలీసుల లాఠీచార్జితో రెచ్చిపోయి రైల్వేస్టేషన్‌లో తీవ్ర విధ్వంసం సృష్టించారు. రైలు ఇంజిన్లు, ఏసీ బోగీల అద్దాలు పగలగొట్టారు.

కొన్ని బోగీలకు నిప్పుపెట్టారు. రైల్వే పార్సిళ్లను బయటపడేసి నిప్పుపెట్టారు. దీంతో భయాందోళనకు లోనైన ప్రయాణికులు లగేజీని వదిలేసి పరుగులు పెట్టారు. భద్రతా సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం, ఆందోళన శ్రుతి మించుతుండటంతో రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఒకరు మృతి చెందగా మరో 13 మంది గాయపడ్డారు. అయినా సాయంత్రం దాకా ఆందోళన కొనసాగింది. రంగంలోకి దిగిన హైదరాబాద్‌ పోలీసులు.. చర్చలు జరుపుదామంటూ ఆందోళనకారులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ విధ్వంసంలో రూ. 7 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు.    

సాక్షి, హైదరాబాద్‌/సికింద్రాబాద్‌: హైదరాబాద్‌లోని హకీంపేట ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీసర్‌ పరిధిలో 2021 మార్చి 31న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించారు. మొత్తం 6,900 మంది హాజరవగా.. ఫిజికల్, మెడికల్‌ పరీక్షలు దాటి 3 వేల మంది వరకు రాతపరీక్షకు ఎంపికయ్యారు. కరోనా కారణంగా ఆ ఏడాది మే 1న జరగాల్సిన రాతపరీక్ష వాయిదా పడింది. ఎప్పుడు పెడతారా అని అభ్యర్థులు ఎదురుచూస్తున్న తరుణంలో.. కేంద్రం అగ్నిపథ్‌ పేరిట ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ (టీఓడీ)’అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది.

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు గరిష్ట వయోపరిమితి 23 ఏళ్లు కాగా.. అగ్నిపథ్‌కు 21 ఏళ్లు మాత్రమే. ఓవైపు రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ఆపేయడం, మరోవైపు వయోపరిమితి తగ్గి అర్హత కోల్పోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగాలని నిర్ణయించుకున్నారు. రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ సమయంలో కలిసినప్పుడు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్‌ గ్రూపుల్లో దీనిపై ప్రచారం చేసుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే జంక్షన్‌ వద్ద నిరసన చేపడదామని నిర్ణయించుకున్నారు. 

మీడియాకు ఫోన్లు చేసి మరీ.. 
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగులు, ఆర్మీ ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు రాష్ట్రంలోని దూర ప్రాంతాలవారు గురువారం రాత్రే సికింద్రాబాద్‌ చేరుకుని.. రైల్వేస్టేషన్‌లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో బస చేశారు. సమీప ప్రాంతాల వాళ్లు శుక్రవారం తెల్లవారుజామునే వివిధ రైళ్లలో సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. ఆందోళన మొదలుపెట్టడానికి ముందు కొందరు మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిరసన చేపడుతున్నట్టు సమాచారమిచ్చారు.

మొదట ఉదయం 9.30 గంటల సమయంలో దాదాపు 100 మంది అభ్యర్థులు.. రేతిఫైల్‌ బస్‌స్టేషన్‌ వైపు నుంచి రైలుపట్టాలపైకి చేరుకున్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలను వెంటనే నిర్వహించాలని, అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. మౌలాలి వైపు వెళ్లే రైళ్లకు అడ్డంగా నిలబడి ఆపేశారు. మిగతా ఆందోళనకారులు లోపలికి ప్రవేశించడానికి సమయం కోసం వేచి చూశారు.

ఇదంతా కొద్ది నిమిషాల్లోనే జరగడంతో రైల్వే అధికారులు, జీఆర్‌పీ (గవర్నమెంట్‌ రైల్వే పోలీస్‌), ఆర్‌పీఎఫ్‌ (రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌) పోలీసులు అవాక్కయ్యారు. వైర్‌లెస్‌ సెట్లలో దీనిపై సమాచారం ఇవ్వడంతో అన్నిద్వారాల వద్ద ఉన్న పోలీసులు ఆందోళన జరిగే ప్రాంతానికి పరుగులు పెట్టారు. ఇదే సమయంలో బయట వేచి ఉన్న ఆందోళనకారులంతా స్టేషన్‌లోకి చొచ్చుకువచ్చారు. ప్లాట్‌ఫాంలపై ఆగిఉన్న రైళ్ల అద్దాలు పగలగొడుతూ ప్రయాణికులు వెళ్లిపోవాలని హెచ్చరించారు. 

పోలీసుల లాఠీచార్జితో.. 
ఈలోగా ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు లాఠీచార్జికి దిగడంతో ఆందోళనకారులు అదుపు తప్పారు. వరుసగా ఒక్కో ప్లాట్‌ఫాంలో రైల్వే పరికరాలు, ఫర్నీచర్, దుకాణాలను ధ్వంసం చేస్తూ పట్టాలపై పడేస్తూ వెళ్లారు. ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన రెండు పార్శిల్‌ సర్వీస్‌ బోగీలకు, మరో రైలు బోగీకి నిప్పుపెట్టారు. 3 రైళ్ల ఇంజన్లు, ఏసీ బోగీల అద్దాలు పగలగొట్టారు. ప్లాట్‌ఫామ్‌లపై రైళ్ల రాక కోసం ఎదురుచూస్తున్నవారు, రైళ్లలో ఉన్న, కిందికి దిగిన ప్రయాణికులు భయంతో బయటికి పరుగులు పెట్టారు. చాలా మంది లగేజీని కూడా వదిలేసి పరుగెత్తారు. 

డీజిల్‌ ట్యాంక్‌వైపు వెళ్తుండటంతో.. 
ఆందోళనకారులు అప్పటికే ఆరో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ దాటేశారు. పదో నంబర్‌ ఫ్లాట్‌ఫామ్‌ పక్కన భారీ డీజిల్‌ ట్యాంక్, కంట్రోల్‌ రూం ఉండటంతో.. వాటికి నిప్పుపెట్టినా, ధ్వంసం చేసినా పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆర్‌పీఎఫ్‌ పోలీసులు ఆందోళనకు గురయ్యారు. సరిపడా సిబ్బంది లేకపోవడం, ఆందోళనకారులు చొచ్చుకువస్తుండటంతో కాల్పులకు దిగారు. దీనితో రాకేశ్‌ అనే యువకుడు మృతిచెందగా.. మరో 13 మందికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం, క్షతగాత్రులకు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

అడ్డుకునే ‘శక్తి’లేకనే.. కాల్పుల వరకు 
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మొత్తం 10 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. శుక్రవారం విధుల్లో కేవలం 80 మంది రైల్వే పోలీసులు మాత్రమే విధుల్లో ఉన్నారు. వీరిలో 50 మంది ఆర్‌పీఎఫ్, 15 మంది జీఆర్‌పీ వాళ్లు కాగా.. మిగతా 15 మంది హోంగార్డులు. నిజానికి రోజూ కేవలం 50 మందే విధుల్లో ఉంటారని.. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండటంతో రెండు రోజులుగా మరికొందరిని మోహరించారని సమాచారం. ఉన్నది కొందరే కావడం, ఆందోళనల సమయంలో ఎలా వ్యవహరించాలనే అనుభవం లేకపోవడంతో.. రైల్వేస్టేషన్‌లో విధ్వంసం, కాల్పుల వరకు వెళ్లినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి.

ఈ క్రమంలోనే రైలు పట్టాలు, ప్లాట్‌ఫామ్‌లపై నిరసనకు దిగిన ఆందోళనకారులపై విచక్షణా రహితంగా లాఠీచార్జి చేశారని.. ఇది వారు మరింత రెచ్చిపోయేందుకు కారణమైందని అంటున్నాయి. సాధారణంగా ఆందోళనల సమయంలో మొదట మైకుల్లో హెచ్చరించాలని, అప్పటికీ పరిస్థితులు మారకుంటే మొదట టియర్‌ గ్యాస్‌ ప్రయోగం, ఆపై లాఠీచార్జి చేయాలని పేర్కొంటున్నాయి. మరీ హింసాత్మక ఆందోళనతో తీవ్ర నష్టం వస్తున్నట్టు ఆధారాలు ఉన్నప్పుడే కాల్పుల వరకు వెళ్లాలని.. ఈ అంశాలను రైల్వే పోలీసులు పట్టించుకోలేదని అంటున్నాయి.
సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అభ్యర్థుల నిరసన 

భారీ విధ్వంసం జరగకూడదనే.. 
సికింద్రాబాద్‌ (హైదరాబాద్‌): రైల్వేస్టేషన్‌లో భారీ పేలుడు వంటి విధ్వంసమేదీ జరగకుండా నిలువరించేందుకే.. తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని రైల్వే పోలీసులు పేర్కొంటున్నారు. ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు, అదుపు చేసేందుకు చాలాసేపు ప్రయత్నించామని అంటున్నారు.

తీవ్ర భయాందోళనకు గురయ్యాం 
బిహార్‌లోని పట్నా సమీపంలో ఉన్న మా ఊరికి వెళ్లేందుకు ఉదయం 9.30 గంటలకు సికింద్రాబాద్‌కు వచ్చాను. కొద్ది నిమిషాల్లోనే వందల మంది రైల్వేస్టేషన్‌లోకి చొరబడ్డారు. పోలీసులు, ఆందోళనకారుల ఉరుకులు, పరుగులతో తీవ్రంగా భయమేసింది. కాసేపటికే బోగీలకు నిప్పు పెట్టడం, పట్టాలపై బైకులు వేసి అంటించడం కనిపించింది. దీనితో స్టేషన్‌ నుంచి బయటికి పరుగెత్తాం.    
–నితేష్, బిహార్, ప్రత్యక్ష సాక్షి 

హైదరాబాద్‌ పోలీసులు వచ్చాకే అదుపులోకి..
పోలీసు కాల్పుల అనంతరం కూడా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. ప్లాట్‌ఫామ్‌ల పైనుంచి వెళ్లిపోయి రైలు పట్టాలపైకి చేరుకుని రాళ్లు రువ్వుతూ నిరసన కొనసాగించారు. వాస్తవానికి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో భద్రత బాధ్యత ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ బలగాలే చూసుకుంటాయి. అయితే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో హైదరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగారు.

పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాల మేరకు.. అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్, జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌లతోపాటు ఉత్తర మండల డీసీపీ చందనా దీప్తి, అదనపు డీసీపీ జి.వెంకటేశ్వర్లు తదితరులు మధ్యాహ్నానికి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించి.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడానికి వ్యూహం రూపొందించారు. సాయంత్రం 4 గంటల సమయంలో చర్చలు జరుపుదామని నిరసనకారులకు ప్రతిపాదించారు.

కొందరు తమతో వస్తే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఏఆర్‌ఓ) వద్దకు తీసుకువెళ్తామని చెప్పారు. కానీ ఆందోళనకారులు దీనికి సమ్మతించలేదు. అధికారులే తమ వద్దకు వచ్చి చర్చించాలని పట్టుబట్టారు. ఇలాగే మరో గంట సమయం గడిచింది. ఈలోగా రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న సిటీ పోలీసు బలగాలు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, ఇతర ప్రత్యేక బలగాలతోపాటు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌)ను రంగంలోకి దింపారు. రైల్వేస్టేషన్‌ను చుట్టుముట్టారు. 

► సాయంత్రం 5 గంటల సమయంలో 20 మందిని చర్చలకు తీసుకెళ్తామని ప్రతిపాదించారు. మధు, బాల్‌సింగ్‌ల నేతృత్వంలోని బృందం చర్చలకు వస్తుందని నిరసన కారులు చెప్పారు. ఇలా సుమారు 20 మందిని స్టేషన్‌ నుంచి బయటకు తీసుకెళ్లి వివిధ ఠాణాలకు తరలించారు. 
► ఆరు గంటల సమయంలో బలగాలన్నీ ఒక్కసారిగా ఆందోళనకారులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నాయి. పారిపోతున్న వారిని, ప్లాట్‌ఫామ్స్‌ వైపు వెళ్తున్న వారిని పోలీసులు వెంబడించి పట్టుకుని స్టేషన్లకు తరలించారు. కాసేపట్లోనే రైల్వే స్టేషన్‌ అధికారుల అధీనంలోకి వచ్చింది. 

రాకేశ్‌ మృతిపై పోస్టుమార్టంలో స్పష్టత!
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఘటనలో మృతి చెందిన దామెర రాకేశ్‌కు ఛాతీ భాగంలో రక్తపు గాయమైందని వైద్యులు తెలిపారు. అయితే రాకేశ్‌ మరణానికి కారణం రాయి తగలడమా, తూటా కారణమా అన్న దానిపై పోస్టుమార్టం నివేదికలో స్పష్టత వస్తుందని వెల్లడించారు.

9 గంటలు.. కలకలం..
శుక్రవారం ఉదయం 9.30 గంటలు
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో (మౌలాలి వైపు) రేతిఫైల్‌ బస్‌స్టేషన్‌ వెనుక ఉన్న రైల్వేట్రాక్‌పైకి ఒక్కసారిగా 100 మంది ఆందోళనకారులు వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష యథాతథంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 

9.40 గంటలు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు లాఠీచార్జి చేశారు. అదే సమయంలో ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌లోని అన్ని ప్రవేశ ద్వారాల నుంచి ఒక్కసారిగా వందల మంది ఆందోళనకారులు రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకు వచ్చి విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టారు. 

10:15 దాదాపు 25 నిమిషాల్లోనే.. ఒకటి నుంచి 6వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వరకు ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న యంత్రాలు, దుకాణాలను ధ్వంసం చేశారు. గూడ్స్‌ రైళ్లలో పంపేందుకు ఉంచిన పార్శిల్‌ కార్యాలయానికి చెందిన ప్యాకేజీలు, ద్విచక్ర వాహనాలను పట్టాలపై వేసి నిప్పుపెట్టారు. రైలు బోగీలకూ నిప్పంటించారు. 

10:30 ఆందోళనకారులు 6వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో ప్రత్యేక పోలీసు బృందాలు రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించాయి. వారిని అదుపు చేయడం కోసం కాల్పులు జరిపారు. పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. 

11:00 పోలీసు బృందాలు రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఆందోళనకారులను బయటకు తరిమాయి. దీనితో వారంతా మౌలాలి వైపున్న రైల్వేట్రాక్‌పైకి చేరుకుని.. పోలీసులపై రాళ్లు రువ్వుతూ ఆందోళన కొనసాగించారు.

మధ్యాహ్నం 12.00 గంటలు
హైదరాబాద్‌ అదనపు సీపీ శ్రీనివాస్, జాయింట్‌ సీపీ రంగనాథ్,డీసీపీ చందనాదీప్తి, అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు రైల్వేస్టేషన్‌కు చేరుకుని పరిస్థితులను సమీక్షించారు.

2.00 గంటలు ఆందోళనకారులతో పోలీసు అధికారులు చర్చలు ప్రారంభించారు. ఆందోళనకారుల నుంచి ఇద్దరు ప్రతినిధులు వస్తే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి తీసుకెళ్లి చర్చిద్దామని సూచించారు. కానీ ఆందోళనకారులు ముందుకు రాలేదు. ఆర్మీ అధికారి వచ్చి రాత పరీక్ష తేదీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల చర్చల ప్రయత్నాలను కొనసాగించారు. అదే సమయంలో రైల్వేస్టేషన్‌ చుట్టూ భారీ సంఖ్యలో బలగాలను సిద్ధం చేశారు. 

6.15 గంటలు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సహా పలు విభాగాలకు చెందిన వందల మంది పోలీసులు అన్నివైపుల నుంచి రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకువచ్చారు. ఆందోళనకారులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. 

7.00 గంటలు రైల్వే అధికారులు, సిబ్బంది స్టేషన్‌లో పరిస్థితిని చక్కదిద్దే ఏర్పాట్లు మొదలుపెట్టారు. పట్టాలపై వేసిన వాహనాలు, ఇతర సామగ్రిని తొలగించడం వంటి చర్యలు చేపట్టారు. 

రాత్రి 08.30 గంటలు రైల్వేస్టేషన్‌ నుంచి రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభంఅయ్యాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top