సూర్య తేజస్వి వ్యాఖ్యలు.. విజయశాంతి రియాక్షన్‌ | MLC Vijayashanthi Reaction To BJP MP Surya Tejasvi Comments | Sakshi
Sakshi News home page

సూర్య తేజస్వి వ్యాఖ్యలు.. విజయశాంతి రియాక్షన్‌

Apr 17 2026 10:09 AM | Updated on Apr 17 2026 10:27 AM

MLC Vijayashanthi Reaction To BJP MP Surya Tejasvi Comments

సాక్షి, హైదరాబాద్‌: పాకిస్థాన్ విభజన కన్నా ఘోరంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిందని బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలు, ప్రాణ త్యాగాలను కించపరచే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సీట్ల పెంపుదల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ బాధ్యతారహిత కామెంట్స్ పుండుమీద కారం చల్లే విధంగా ఉన్నాయన్నారు.

‘‘ఓ వైపు దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వివక్ష చూపుతోందని విమర్శలు వస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎంపీ తెలంగాణ సెంటిమెంట్ ను కించపరుస్తూ పార్లమెంట్ వేదికగా మాట్లాడటం గర్హనీయం. లోక్‌సభ స్పీకర్ ఈ వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు కోరాలి. అలా చేసి, ఈ తప్పును సరిదిద్దాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సూర్య తేజస్వి కామెంట్స్‌ను ఖండించడం మానేసి, ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణను సాధించగలరా? అనే విధంగా టీబీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించడం విడ్డూరంగా ఉంది.’’ అంటూ విజయశాంతి మండిపడ్డారు.

‘‘నేను, కేసీఆర్‌ పార్లమెంట్ లోపల బయట తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా పోరాటం చేశామనే విషయాన్ని తెలంగాణ ఉద్యమకారులను అడిగితే చెబుతారు. ఈ ఉద్యమ స్ఫూర్తిని గుర్తించడం వల్లే సోనియాగాంధీ పెద్ద మనసుతో రాష్ట్ర విభజనకు అంగీకారించరాన్న విషయం అందరికీ తెలుసు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించకుండా సూర్య తేజస్వి చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ ఖండిస్తోందా లేదా అనే ప్రశ్నకు క్లారిటీ ఇవ్వాలి’’ అంటూ విజయశాంతి డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement