కరోనాతో కల్యాణాలకు తెర..! వర్చువల్‌ వివాహాలకు సై..!

Marriages Postponed Due To Coronavirus - Sakshi

గతేడాది నుంచి కలసిరాని ముహూర్తాలు

కరోనా వైరస్‌ విజృంభణతో వాయిదా పడిన పెళ్లిళ్లు

వధూవరులు విదేశాల నుంచి రాలేని దుస్థితి.. పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి

శుక్ర మూఢమితో ఏకంగా 70 రోజులు శుభకార్యాలు బంద్‌

ఈ ఏడాది మే, జూన్‌లో అధిక సంఖ్యలో వివాహాలకు ఏర్పాట్లు

కానీ సెకండ్‌వేవ్‌తో ఆటంకాలు

ఫంక్షన్‌ హాళ్లు, బాజాభజంత్రీల అడ్వాన్స్‌ బుకింగ్‌లు రద్దు

వర్చువల్‌ వివాహాలకు ప్రణాళికలు

హైదరాబాద్‌ కర్మన్‌ఘాట్‌లో నివసించే స్వప్నకు అస్ట్రేలియాలో నివసించే అబ్బాయితో పెళ్లి నిశ్చయమైంది. గత ఏడాది జనవరిలో నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం.. అదే ఏడాది మే నెల 25న పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉంది. అయితే ఆ ముహూర్తం కాస్తా లాక్‌డౌన్‌లో కొట్టుకుపోయింది. అనం తరం కరోనా తగ్గుముఖం పట్టినా ఆస్ట్రేలియా నుంచి పెళ్లికొడుకు వచ్చే పరిస్థితి లేక.. శుభముహూర్తాల్లేక ఈ ఏడాది మే నెలలో పెళ్లి చేయాలని నిర్ణయించి మళ్లీ ముహూర్తం పెట్టుకున్నారు. కానీ కరోనా మరోసారి కాదు కూడదు అంది. మన దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుండడంతో విమాన సర్వీసుల రాకపోకలపై ఆస్ట్రేలియా అంక్షలు విధించింది. దీంతో పెళ్లికొడుకు ఈసారి కూడా అక్కడి నుంచి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి..’అన్నాడో సినీ కవి. కానీ కొంతకాలంగా పెళ్లిళ్లకు ముహూర్తాలు కలిసిరావడం లేదు. గత ఏడాది పెద్ద సంఖ్యలో ముహూర్తాలకు కరోనా అడ్డుపుల్ల వేసింది. తప్పదు అనుకున్న కొన్ని జంటలు మినహా, ఏమైనా సరే తమకు నచ్చిన విధంగా పెళ్లిళ్లు చేసుకోవాలని ఆశించిన జంటలన్నీ 2021కి వాయిదా వేసుకున్నాయి.

ఈ ఏడాది హుషారుగా వివాహాలకు సిద్ధమవుతున్న జంటలకు తొలుత శుక్ర మూఢమి దెబ్బ కొట్టింది. దాదాపు 70రోజుల పాటు శుభకార్యాలకు అవకాశం లేకుండా చేసింది. దీంతో ఉసూరుమంటూ మే నెల 1 నుంచి వైశాఖ మాసం కాబట్టి జూన్‌ నెల దాకా బాగా ముహూర్తాలు ఉన్నాయిలే అని చాలామంది పెళ్లిళ్లకు అన్ని ముందస్తు ఏర్పాట్లూ చేసేసుకున్నారు. అయితే శుభ ముహూర్తాలు లేని 3 నెలలూ కాస్త నెమ్మదించిన కరోనా.. మరోసారి విరుచుకుపడింది. ఆయా కుటుంబాలను పెళ్లి సందడి నుంచి దూరం చేస్తోంది. 

ముందు ముహూర్తం.. వెనకే కరోనా
ఇతర శుభకార్యాల మాటేమో గానీ.. నూరేళ్ల పంట పెళ్లిని మాత్రం వీలైనంత ఘనంగా, అధిక సం ఖ్యలో బంధుమిత్రుల సమక్షంలో చేసుకోవాలని అంతా భావిస్తారు. కానీ కరోనా భాజాభజంత్రీలకు బ్రేక్‌ వేస్తోంది. అనూహ్య రీతిలో విరుచుకుపడుతున్న సెకండ్‌ వేవ్‌.. అన్ని ఏర్పాట్లూ చేసుకుని వివాహాలకు సిద్ధమైనవారిని తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వధువో, వరుడో రావాల్సిన పెళ్లిళ్లన్నీ దాదాపుగా వాయిదా పడ్డాయి.

అంతర్జాతీయంగా చాలా దేశాలు భారత్‌ని రెడ్‌ జోన్‌ కంట్రీగా పరిగణిస్తూ మనదేశానికి రాకపోకలపై ఆనేక రకాల ఆంక్షలు పెడుతుం డడమే దీనికి కారణం. మరోవైపు స్థానిక ఆంక్షలు, నిబంధనలు నడుమ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమో, ఒకవేళ వివాహ ఏర్పాట్లు చేసినా ఆహ్వానం అందుకున్న అతిధులు ఈ పరిస్థితుల్లో వస్తారో రారో, సందేహాలతో.. ఇప్పటికే మరి కొందరు పెళ్లిళ్లను రద్దు చేసుకుంటున్నట్టు సమాచారం. కొన్ని జంటలు మాత్రం మే నెలాఖరుకు కేసులు తగ్గుముఖం పడతాయని, వ్యాక్సినేషన్‌ ఊపందుకుంటుందని ఆశాభావంతో ఉన్నాయి. కొందరు మాత్రం వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత కరోనాను ఎదుర్కొంటూనే రకరకాల సర్దుబాట్లతో పెళ్లికి సై అంటున్నారు. 

వర్చువల్‌...డెస్టినేషన్‌ 
ఈ నేపథ్యంలో పెళ్లి వేడుకలు ఆన్‌లైన్‌ అవుతున్నాయి. నిబంధనలు కఠినంగా ఉన్నా, సులభతరం చేసినా పెళ్లికి ప్రత్యక్షంగా హాజరు కావడం కంటే... వర్చువల్‌గా అటెండ్‌ అవడమే సురక్షితమని చాలామంది ఆహ్వానితులు భావిస్తున్నారని వెడ్డింగ్‌ విష్‌ లిస్ట్‌ అనే సంస్థ నిర్వాహకులు కనికా సుభాష్‌ చెప్పారు. ఈ కారణంగానే పలు జంటలు తమ పెళ్ళిళ్ల విషయంలో వర్చువల్‌ ప్లాన్స్‌కి ఓటేస్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ నగరాల్లో నిబంధనలు శరవేగంగా మారుతున్నాయి.

కొన్ని ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీంతో కొంతమంది తమ పెళ్లిళ్లను తక్కువ నిబంధనలు ఉన్న గోవా లాంటి చోట్లకు మారుస్తున్నారని (డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌) ఆన్‌లైన్‌ వెడ్డింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ వెడ్డింగ్‌ బ్రిగేడ్‌కు చెందిన సన్నా వోహ్రా తెలిపారు. అయితే ఈ విధంగా ప్లాన్‌ చేసేవారు... తాము వెళ్లబోతున్న ప్రాంతంలో ఆకస్మిక నిబంధనలు వచ్చిపడే అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ప్లాన్‌–బీ కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉందని వెడ్డింగ్‌ ప్లానర్‌ హరీష్‌ సూచించారు. 

వివాహం, విందు వేళల్లో మార్పులు
రాత్రి కర్ఫ్యూ వల్ల వివాహ వేడుకలలో భాగమైన విందుల వేళలూ మారిపోయాయి. విందు విషయానికి వస్తే బ్రంచ్‌ లేదా లంచ్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. పెళ్లి టైమ్‌ కూడా వీలున్నంత వరకూ ఉదయం వేళలోనే ఉండేలా చూస్తున్నారు. పరిమిత సంఖ్యలో ఆతిథులను ఆహ్వానించాలని ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో కేవలం వదువు, వరుడు కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు.

అయితే, చాలావరకు ప్రస్తుతం పెళ్లిళ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదనే భావనలో ఉన్నారు. కరోనా పరిస్థితుల నుంచి తేరుకున్న తర్వాతే వెడ్డింగ్‌ చేసుకోవడం మేలని పెళ్లి వాయిదాకే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే చేసుకున్న అడ్వాన్స్‌ బుకింగ్‌లు రద్దు చేసుకుంటున్నారు. అయితే డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కొందరు ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులు, కేటరింగ్‌ తదితర ఏర్పాట్ల నిర్వాహకులు పెళ్లి ఎప్పుడు జరిగితే అప్పుడు ఈ మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు.

ఆధారిత రంగాలపై ప్రభావం
పెళ్లి రెండు కుటుంబాలకు సంబంధించిందే అయినా.. ఆ పెళ్లి జరిగే తీరుతెన్నులపై కొన్ని పదుల, వందల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉంటాయన్న విషయం తెలిసిందే. వరుసగా పెళ్లిళ్లకు వచ్చిపడుతున్న అడ్డంకులతో ఫంక్షన్‌ హాల్స్‌ మొదలుకుని కేటరింగ్‌ సంస్థలు ఇంకా అనేక రంగాలకు చెందిన వారు తీవ్రంగా నష్టపోనున్నారు. ఇదంతా ఒకెత్తయితే.. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా జనవరి నుంచే ఫంక్షన్‌హాళ్లకు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలకు, ఇతర ఏర్పాట్లకు చాలామంది ముందస్తు బుకింగ్‌లతో అడ్వాన్స్‌లు భారీగా చెల్లించారు. తీరా సెకండ్‌వేవ్‌ విజృంభణతో శుభకార్యాలు వాయిదా వేసుకోగా ఇప్పుడివి వెనక్కి రావడం లేదని, ఈ విధంగా కూడా నష్టపోయామని పెళ్లిళ్లను వాయిదా వేసుకున్న వారు వాపోతున్నారు. 

చాలావరకు వాయిదాకే మొగ్గు
ఏప్రిల్‌ నెలాఖరు నుంచి జరగాల్సిన పెళ్లిళ్లు చాలావరకు ఆగిపోయాయి. ఇండియా రెడ్‌ జోన్‌ అని విదేశాలు ప్రకటించడంతో విదేశీ సంబంధాలు కుదుర్చుకున్నవారు వాయిదా వేయక తప్పడం లేదు. పెళ్లికి ఇరువైపు కుటుంబాల అమ్మమ్మలు, తాతయ్యలు వంటి పెద్దలంతా తప్పకుండా ఉండాల్సిందే. కానీ ఇప్పటి పరిస్థితుల్లో వారి ఆరోగ్యానికి సమస్యలొస్తాయని వెనకాడుతున్నారు. దాదాపుగా మే నెలలో పెట్టుకున్న ముహూర్తాలన్నీ వాయిదాపడినట్టే. దీంతో చాలామంది అడ్వాన్సుల రూపంలో చెల్లించిన రూ.లక్షలు నష్టపోతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గితే గానీ వివాహాలు ఊపందుకోవు.
–డి.వి.కోటిరెడ్డి, అవినాష్‌రెడ్డి మ్యారేజ్‌ బ్యూరో

మళ్లీ అక్టోబర్‌లోనే మంచిరోజులు
పోయిన ఏడాదంతా కరోనా. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఏప్రిల్‌ నెలాఖరు దాకా మంచి రోజులు లేకపోవడం వల్ల పెళ్లిళ్లు జరగలేదు. తాజాగా మొదలవుతున్న పెళ్లిళ్ల సీజన్‌ జూన్‌ 26 వరకూ కొనసాగుతుంది. ఈ కరోనా కారణంగా కొన్ని పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి కొందరు ఇళ్లలోనే చేసేద్దామంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఈ సీజన్‌లో కూడా పెద్దగా పెళ్లిళ్లు జరిగేలా లేవు. ఆ తర్వాత మంచి రోజులు అంటే మళ్లీ అక్టోబర్‌ దాకా ఆగాల్సిందే. 
–ఒరుగంటి కళ్యాణ రామశర్మ, పురోహితులు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top