
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో వంద కోట్ల ముడుపుల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుది పేస్తోంది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న.. బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య వైరం పతాకస్థాయికి చేరింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ స్కామ్‌లో నోటీసులు జారీ చేయడంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. పరస్పర ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో వాతావరణం ఎన్నికలకు ముందే వేడెక్కుతోంది.
గురువారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారంటూ ధ్వజమెత్తారు. భారత్ జాగృతి దీక్ష కోసం బుధవారం నాడే ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్సీ కవిత కూడా మోదీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఇక ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి..అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారంటూ ప్రతి విమర్శలు చేశారు.
మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా రాష్ట్రంలో తాజా పరిణామాలపై స్పందించారు. ఇలావుండగా కవితకు ఈడీ నోటీసుల వ్యవహారం గురువారం నాటి కేబినెట్ భేటీలోనూ చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాగా శుక్రవారం బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుండటం, పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలంటూ ఢిల్లీలో కవిత చేయనున్న దీక్షకు పోటీగా శుక్రవారం నాడే ‘మహిళా గోస – బీజేపీ భరోసా’పేరిట ఆ పార్టీ రాష్ట్ర నేతలు సైతం దీక్ష చేపట్టనుండటంతో.. రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కే సూచనలు కన్పిస్తున్నాయి.
తీవ్రమవుతున్న రాజకీయ పోరు
కవిత దీక్ష చేయనున్న జంతర్‌మంతర్ వద్దే మరో రెండు పార్టీలు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతినివ్వడంతో భారత్ జాగృతి భారీ జన సమీకరణ ఆశలకు గండిపడినట్టయ్యింది. మద్యం కుంభకోణాన్ని పక్కదారి పట్టించడానికే ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ల పేరిట దీక్ష కార్యక్రమాన్ని ఎంచుకున్నారని బీజేపీ నాయకులు విమర్శిస్తుండగా.. ‘లిక్కర్ కేసులో ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటా.
నేను తప్పు చేయలేదు. భయపడే ప్రసక్తే లేదు. న్యాయం మా వైపే ఉంది. కక్ష సాధింపు చర్యలను రాజకీయంగా ఎదుర్కొంటా..’అటూ కవిత దీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా బీఆర్‌ఎస్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య రాజకీయ పోరు తీవ్రమవుతోంది.