
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా బారినుంచి కోలుకున్నవారి సంఖ్య లక్షన్నర దాటిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో గురువారం వరకు 27,41,836 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,81,627 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో 1,50,160 మంది కోలుకున్నట్లు ఆయన తెలిపారు. వైరస్ నుంచి కోలుకున్నవారి రేటు రాష్ట్రంలో 82.67% ఉన్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం ఒక్కరోజులో 57,621 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,381 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,080కి చేరింది. కరోనా బారి నుంచి ఒక్కరోజే 2,021 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,387 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వీరిలో 24,592 మంది ఇళ్లు, ఇతరత్రా సంస్థల ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని శ్రీనివాసరావు తెలిపారు.