సాక్షి, చైన్నె: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురై ప్రదేశం కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్. రాజీవ్ హత్యానంతరం ఈ ప్రాంతాన్ని త్యాగభూమిగా పిలుస్తూ వస్తున్నారు. అందుకే ఇక్కడ డీఎంకే కూటమిలో ప్రతి సారి కాంగ్రెస్ పోటీ చేస్తూ వస్తోంది. మళ్లీ గెలుపు లక్ష్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై దూసుకెళ్తున్నారు. ఆయన్ని ఢీకొట్టే విధంగా అన్నాడీఎంకేకు చెందిన బలమైన అభ్యర్థి కె పళణి మళ్లీ బరిలో దిగారు. ఇక, కొత్త ముఖాలుగా విజయ్ టీవీకే అభ్యర్థిగా తెన్నరసు, సీమాన్ ఎన్‌టీకే అభ్యర్థిగా సింధు పోటీలో ఉన్నారు. వివరాలు.. కాంచీపురం జిల్లాలో శ్రీపెరంబదూరు ఉన్నప్పటికీ, ఇది గ్రేటర్ చైన్నెలో భాగం అన్నట్టుగా కనిపిస్తుంది. పారిశ్రామిక వాడలకు నిలయంగా ఉన్న ఈ ప్రదేశం పేరిట అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలు రెండూ ఉన్నాయి. అంతే కాదు, శ్రీపెరంబుదూర్ (ఎస్సీ) నియోజకవర్గం ఆధ్యాత్మికతకు మారుపేరుగా, వైష్ణవ తత్వవేత్త శ్రీ రామానుజుల జన్మస్థలం కావడమే కాకుండా, ’దక్షిణాసియా డెట్రాయిట్’గా పిలవబడే సిప్‌కాట్ పారిశ్రామిక ప్రాంతాలు ఇక్కడే ఉండటం విశేషం. లోక్‌సభ ఎన్నికలలో ఇక్కడి డీఎంకే అభ్యర్థిగా టీఆర్‌బాలు వరుసగా విజయకేతనం ఎగుర వేస్తూ వస్తున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల సమరం ఇక్కడ వేడెక్కింది. త్యాగ భూమిని మళ్లీ కై వసం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెట్టింది. 1952 నుండి ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ 7 సార్లు, డీఎంకే 4 సార్లు, అన్నాడీఎంకే 2 సార్లు విజయం సాధించాయి. 2021లో కాంగ్రెస్ అభ్యర్థి సెల్వ పెరుంతొగై అన్నాడీఎంకే అభ్యర్థి కె పళనిపై 10 వేల 879 ఓట్లతో గెలిచారు.
అభ్యర్థుల బలాబలాలు ఇలా
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సెల్వ పెరుంతొగై మళ్లీ రేసులో ఉన్నారు. నియోజకవర్గంలో వ్యక్తిగత పరిచయాలు, కూటమి బలం ఆయనకు అనుకూలం. అదే సమయంలో అన్నాడీఎంకే అభ్యర్థి కె. పళణి బలమైన అభ్యర్థి కావడం గమనార్హం. 2016లో సెల్వ పెరుంతొగైపై విజయకేతనం ఎగుర వేసి అసెంబ్లీలో పళణి అడుగు పెట్టారు. 2021లో 10 వేల పై చిలుకల ఓట్లతో ఓటమి పాలయ్యారు. మళ్లీ ఆయన్నే అన్నాడీఎంకే అభ్యర్థిగా రంగంలోకి దించింది. మాజీ ఎమ్మెల్యేగా పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు, తాజాగా కలిసి వచ్చిన కూటమి పార్టీల బలం మేళవింపుతో గతంలో కోల్పోయిన విజయాన్ని మళ్లీ సాధించాలనే పట్టుదలతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక యువతను ఆకర్షించి ఓట్లను చీల్చే దిశగా సీమాన్ ఎన్‌టీకే అభ్యర్థి సింధు ఓట్ల వేటలో ఉన్నారు. విజయ్ చరిష్మాతో అభిమానులు, యువత మద్దతపై ఎన్నో ఆశలతో టీవీకే అభ్యర్థి కె తెన్నరసు బరిలో ఉన్నారు. ఈ ఇద్దరు నియోజకవర్గానికి కొత్త ముఖాలు కావడంతో ఎన్నికలలో ప్రధాన సమరం అన్నది సెల్వ పెరుంతొగై, కె పళని మధ్యే ఉన్నది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ , అన్నాడీఎంకే నెలకొన్న ఈ సమరంలో కొత్త ముఖాలు ఓట్లు భారీగానే చీల్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 3,75,921 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో వన్నియర్, మొదలియార్, దళిత , మైనారిటీ, కార్మిక వర్గాల ఓట్లు ఏక పక్షంగా ఎవరికై తే పడుతాయో వారే విజేతలుగా నిలవడం ఖాయం.
ప్రధాన డిమాండ్లు
● పూందమల్లి – శ్రీపెరంబుదూర్ మెట్రో పనులను వేగవంతం చేయాలనేది ప్రధాన డిమాండ్.
● సిప్‌కాట్ కంపెనీలలో స్థానిక యువతకు 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
– భూగర్భ మురుగునీటి వ్యవస్థ, సరైన తాగునీటి సరఫరా ఇక్కడ పెద్ద సవాలుగా మారాయి.
● పారిశ్రామిక అవసరాల కోసం భూసేకరణ జరుగుతున్న తరుణంలో, మిగిలి ఉన్న వ్యవసాయ భూములనుపరిరక్షించాలన్నది రైతుల నినాదం.
● గ్రామీణ ప్రాంతాలన్నీ పట్టణీకరణగా గ్రేట్ చైన్నెలో కలుస్తుండటంతో అభివృద్ధి వేగం పెంచాల్సిన అవశ్యం ఉంది.


