క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Apr 13 2026 8:02 AM | Updated on Apr 13 2026 8:02 AM

ఆందోళన చెందకండి 12 మంది జాలర్ల అరెస్ట్‌ భక్తిప్రపత్తులతో అగ్నిగుండ వేడుకలు లైంగిక వేధింపులు: యువకుడి అరెస్ట్‌ ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌ చోరీ: ముగ్గురి అరెస్ట్‌

కొరుక్కుపేట: గ్యాస్‌ సిలిండర్ల సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అధికారికంగా ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ఆయిల్‌ కంపెనీల (ఐఓసీఎల్‌, పీబీసీఎల్‌., హెచ్‌బీసీఎల్‌) కో–ఆర్డినేటర్‌ వి.సి. అశోకన్‌ జారీ చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అన్ని ప్లాంట్లు, రవాణా సౌకర్యాలు పంపిణీ వ్యవస్థలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు. దీంతో ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ ఎల్పీజీ సిలిండర్లను క్రమపద్ధతిలో పొందగలుగుతున్నారని. అందువల్ల, మీరు ఆందోళన చెందొద్దని కోరారు.

కొరుక్కుపేట: సముద్రంలో సరిహద్దు దాటి అక్రమంగా ప్రవేశించినందుకు కారైకల్‌ జిల్లాకు చెందిన 12 మంది జాలర్లను శ్రీలంక నావికాదళం ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేసింది. కారైకాల్‌ జిల్లా కొటుచ్చేరిమెట్‌కు చెందిన వడివేల్‌కు చెందిన మోటర్‌బోట్‌లో తిరుప్పట్టినం, కారైకల్‌కు చెందిన 12 మంది జాలర్లు కారైకల్‌ మత్స్య రేవు నుంచి చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. వీరు ఆదివారం తెల్లవారుజామున చేపలు పడుతుండగా సరిహద్దు దాటి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణపై బోట్‌ను స్వాధీనం చేసుకుని, అందులోని 12 మంది మత్స్యకారులను అరెస్టు చేసింది. ఈ విషయమై మత్స్యకారులు తమ గ్రామ పంచాయతీలకు ఫిర్యాదు చేశారు. అనంతరం, అరెస్టు అయిన మత్స్యకారులను, పడవను విడుదల చేయాలని వారు పరిపాలనా యంత్రాంగాన్ని , పుదుచ్చేరి జిల్లా ముఖ్యమంత్రిని కోరారు.

తిరుత్తణి: తిరుత్తణిలో ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ వేడుకల్లో మూడువేల మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించారు. వివరాలు.. తిరుత్తణి గాంధీరోడ్డులోని ద్రౌపదీదేవి ఆలయంలో గతనెల 26న అగ్నిగుండ వేడుకలు ధ్వజారోహణంతో ప్రారంభమైయ్యాయి. 18 రోజుల పాటు నిర్వహించిన వేడుకల్లో రోజూ అమ్మవారికి అభిషేక పూజలు నిర్వహించి పట్టణ వీధుల్లో ఊరేగించారు. రోజూ పగటి సమయాల్లో మహాభారత ప్రవచనాలు, రాత్రి వేళల్లో వీధి నాటకాలు ప్రదర్శించారు. వేడుకల్లో ప్రదానమైన అగ్నిగుండ వేడుకలు ఆదివారం సందర్భంగా ఉదయం దుర్యోధన వధ నాటక ప్రదర్శనలో వేలాదిమంది పాల్గొన్నారు. సాయంత్రం అగ్నిగుండ ప్రవేశం సందర్భంగా ఆలయం ముందు వేలాదిగా పట్టణ ప్రజలు గుమిగూడారు. అగ్నిగుండ ప్రవేశంకు కంకణాలు ధరించిన మూడువేల మంది భక్తులు ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అగ్నిగుండం ముందు ప్రత్యక అలంకరణలో ద్రౌపదీదేవి కొలువుదీరగా అగ్నిగుండంకు సంప్రదాయ పద్ధతిలో పూజలు చేపట్టి భక్తులు గోవింద నామస్మరణతో అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించారు. రాత్రి అమ్మవారు పట్టణ వీధుల్లో ఊరేగారు. వేడుకల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

అన్నానగర్‌: లైంగిక వేధింపుల కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాణిపేట జిల్లాకు చెందిన 29 ఏళ్ల మహిళ చైన్నెలోని అరుంబాక్కంలోని మహిళా హాస్టల్‌లో ఉంటూ ఒక ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తోంది. ఈమె అరుంబాక్కంలోని ఒక జిమ్‌కు వెళ్లడానికి ఎన్‌.ఎస్‌.కె నగర్‌ సిగ్నల్‌ దగ్గర నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో అదే జిమ్‌లో శిక్షణ పొందుతున్న ఒక యువకుడు బైక్‌లో వచ్చి ఆమెతో మాట్లాడాడు. ఆ సమయంలో, బైక్‌ వెనుక కూర్చున్న యువకుడు ఆ యువతిని లైంగికంగా వేధించాడు. అమైందకరై పోలీసులకు అందిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరిగింది. విచారణలో అరుంబాక్కంలోని తిరువళ్లువర్‌నగర్‌కు చెందిన గుణశేఖరన్‌ అనే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు గుణశేఖరన్‌(41)ను అరెస్టు చేశారు.

తిరువొత్తియూరు: మధ్యప్రదేశ్‌ రాష్ట్రం, గ్వాలియర్‌ ప్రాంతానికి చెందిన ఖుషీ జైన్‌ (24) విద్యార్థిని, చైన్నె విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదువుతున్నారు. పరీక్షలు రాయడానికి చైన్నె కీల్పాకంలో వున్న హోటల్‌లో వుంటున్నారు. శనివారం రాత్రి ఖుషీ జైన్‌ గదిలో నిద్రపోయి ఆదివారం ఉదయం లేచి చూసేసరికి గదిలో ఉంచిన ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌, రూ.1,700 నగదు చోరీ జరిగినట్టు తెలిసింది. దీనిపై ఖుషీ జైన్‌ కిల్‌పాక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సంఘటన స్థలంలో అమర్చిన నిఘా కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ కేసులో కీల్పాక్‌కు చెందిన శ్రీధర్‌ (27), కార్తీక్‌ (19), సతీష్‌ (22) అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement