ఎం.వెంకయ్యనాయుడు
కొరుక్కుపేట: గురువు, స్వర్గీయ పోలూరి హనుమజ్జానకీరామశర్మ కర్తత్వంలో రూపొందిన ఉపదేశామృత తరంగిణి పునర్ముద్రణను చైన్నెలోని లోక్‌భవన్‌లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఆయన గురువు స్మృతికి నివాళులర్పించారు. ప్రముఖ సంస్కృత పండితులు పూర్ణానందశాస్త్రి ,పుస్తక సంపాదకులు తుమాటి సంజీవరావు, పోలూరి హనుమజ్జానకీరామశర్మ కుటుంబసభ్యులు హాజరయ్యారు. కుర్తాళం సిద్ధేశ్వరి పీఠం ప్రథమ పీఠాధిపతులు విమలానందభారతి ఉపన్యాసాలను పోలూరి హనుమజ్జానకీరామశర్మ ప్రజల కోసం పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. ఏటా ఆయన జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్జానకీరామశర్మ స్మారక ట్రస్ట్ ద్వారా వారి సాహిత్యాన్ని పునర్ముద్రిస్తున్నారు. చెన్నపురి తెలుగు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు తూమాటి సంజీవరావు సంపాదకత్వంలో పునర్ముద్రించిన ఈ పుస్తకాన్ని చైన్నె లోక్‌భవన్‌లో వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తరంగిణి పుస్తకానికి వారు రూపకల్పన చేసిన తీరు మహోన్నతమైనదని వెంకయ్యనాయుడు అన్నారు. పోలూరి నైపుణ్యం, అనుభవం, ఆధ్యాత్మిక మార్గంలో వారి వైశిష్ట్యానికి ఈ పుస్తకం చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు. యువతకు ఈ పుస్తకాన్ని చేరువ చేసే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.


