వేలూరు: వేలూరు జిల్లాలో దివ్యాంగులు, వృద్ధులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతించింది. దీంతో వేలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లు సేకరించేందుకు మొత్తం 51 బృందాలను నియమించింది. దీంతో గత శనివారం నుంచి మూడు రోజుల వరకు వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి పోస్టల్ బ్యాలట్‌ను తీసుకునే పనులు జరుగుతున్నాయి. అయితే అనకట్టు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ తీసుకునే సమయంలో అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే కలైఅరసన్, న్యాయవాది గోవిందస్వామి జిల్లా ఎన్నికల అధికారి సుబ్బలక్ష్మి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఒక వినతి పత్రాన్ని అందజేశారు. అందులో అనకట్టు నియోజకవర్గంలో పుత్తూరు పంచాయతీ ఊచంగాడు గ్రామానికి చెందిన 85 ఏళ్ల వృద్దుడి వద్ద పోస్టల్ ఓటు సేకరించేందుకు వెల్లిన ఒక బృందం ఎన్నికల అధికారుల అనుమతి తీసుకోకుండా డీఎంకే పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు వృద్ధుని బార్య వద్ద సంతకాలు తీసుకొని కొంత నగదును అందజేసి ఓటు వేసుకున్నట్లు తెలిసింది. నియోజకవర్గం పూర్తిగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని అధికారులు నేరుగా వెల్లి పోస్టల్ బ్యాలెట్ తీసుకోవడం లేదని అంగన్‌వాడీ టీచర్, డీఎంకే పార్టీ ప్రతినిధులు తీసుకుంటున్నారని వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదు తీసుకున్న అధికారి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.


