వేలూరు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 23వ తేదీన జరగనున్న నేపథ్యంలో 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు తమ స్వచ్ఛంద నిర్ణయం ప్రకారం ఇంటి నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో వేలూరు జిల్లాలోని వేలూరు, కాట్పాడి, అనకట్టు, గుడియాత్తం, కేవీ కుప్పం వంటి ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి 85 సంవత్సరాలకు పైబడిన వృద్ధులు 7,118 మంది, దివ్యాంగ ఓటర్లు 9,198 మంది ఉన్నారని గుర్తించారు. వీరు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఫారం 12డీని ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. వీరిలో 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 2,224 మంది, దివ్యాంగులు 1,125 మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు ధరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈనెల 11,12,13వ తేదీల్లో ధరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి అధికారులు వెళ్లి పోస్టల్ బ్యాలెట్‌ను సేకరించి సీల్ వేసిన బాక్సులో వేసేందుకు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో వేలూరు జిల్లా అధికారి సుబ్బలక్ష్మి ఇంటింటికి వెళ్లి బ్యాలెట్ ఓట్లు సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలూరు అసెంబ్లీ ఎన్నికల అధికారి సెంథిల్‌కుమార్, సహాయ అధికారి పళణి పాల్గొన్నారు.


