సాక్షి, చైన్నె: రాణిపేట జిల్లా సిప్‌కాట్ ఫేజ్–3లో ఉన్న ఒక ప్రైవేట్ వ్యర్థాల రీసైక్లింగ్ కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుండి భారీగా నల్లటి పొగ వెలువడడంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి. రాణిపేట పరిసరాల్లోని వివిధ కర్మాగారాల నుండి వచ్చే వ్యర్థాలను సేకరించి, వాటిని వేరు చేసి రీసైక్లింగ్ చేసే ఒక ప్రైవేట్ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో వ్యర్థాలను నిల్వ ఉంచిన చోట అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కార్మికులు మంటలను గమనించి ఆర్పేలోపే, అవి వేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. నల్లటి పొగ ఆకాశాన్ని చుట్టేయడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సిప్‌కాట్, రాణిపేట అగ్నిమాపక కేంద్రాలకు చెందిన ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
వీరికి తోడుగా భెల్ సంస్థకు చెందిన అగ్నిమాపక వాహనాలు కూడా రంగంలోకి దిగాయి. అగ్నిమాపక సిబ్బంది సుదీర్ఘంగా పోరాడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మంటలకు ఆహుతైనవన్నీ కర్మాగార వ్యర్థాలేనని ప్రాథమికంగా తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఎంతమేరకు ఆస్తి నష్టం జరిగిందో తేలనున్నది.
ఎగసి పడుతున్న మంటలు


