మెట్రోలో స్టాలిన్ ప్రయాణం
క్యూలో నిలబడి టికెట్ తీసుకున్న వైనం
పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉద్వేగం
సాక్షి, చైన్నె: ఫార్మల్ షర్ట్, ఫ్యాంట్, కళ్లజోడుతో స్టైలిష్‌గా సీఎం స్టాలిన్ శుక్రవారం చైన్నె మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా సాధారణ ప్రయాణికులతో కలసి ముచ్చటించిన ఆయన, మెట్రో ప్రాజెక్టు రూపకల్పనలో తన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఉదయాన్నే చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో స్టైలిష్‌గా ఓ వ్యక్తి క్యూలో నిలబడి టికెట్ తీసుకున్నారు. ఎలాంటి భద్రతా హంగామా లేకుండా ఆ వ్యక్తి టికెట్ తీసుకుని అన్నా సాలైమీదుగా వెళ్లే మెట్రో రైలులో ఎక్కారు. ఆయన వెన్నంటి తెల్ల చొక్కా ధరించిన వ్యక్తి మాత్రం ఉన్నారు. స్టైలిష్‌గా ఉన్న ఆయన్ను గుర్తు పట్టిన ప్రయాణికులు నివ్వెరపోయారు. ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆయన ఎవరో కాదు...మన సీఎం స్టాలిన్. ఆయన వెన్నంటి ఉన్నది ఎమ్మెల్యే ఎలిళన్ నాగనాథన్. స్టాలిన్ మెట్రో రైలులో ఉన్న సమాచారంతో ఒక్క సారిగా అందులో ప్రయాణించే వారంతా ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. కొందరు అయితే, ఆయనతో సెల్ఫీలు దిగారు. మరి కొందరు కుశల ప్రశ్నలు వేశారు. ఈసందర్భంగా స్టాలిన్ తనతో పాటు ప్రయాణించిన వారితో ముచ్చటిస్తూ డీఎంఎస్ వరకు ప్రయాణించారు. డీఎంకేను ఆదరించాలని కోరారు. తేనాంపేట వద్ద దిగేసి తన ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం తన జ్ఞాపకాలతో ట్వీట్ చేశారు.
గత జ్ఞాపకాలు
తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జపాన్ దేశ పర్యటనకు వెళ్లి, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ నుంచి నిధుల సహాయం పొంది, ఈ ప్రాజెక్టును ముందుండి నడిపించిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే, విమ్కోనగర్ నుంచి విమానాశ్రయం వరకు, సెంట్రల్ నుంచి సెయింట్‌థామస్ మౌంట్ వరకు కొనసాగుతున్న మొదటి దశ మెట్రో సేవలను ఇప్పటికే కోట్ల మంది ప్రజలు వినియోగించుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.


