వేలూరు: కలైంజ్ఞర్ ఆదేశాల మేరకు ఎంజీ రామచంద్రన్‌కు డాక్టరేట్ అందజేసేందుకు తాను సిఫారసు చేశానని రాష్ట్ర మంత్రి, డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని కరసమంగలంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌కు ఆయన అభిమాని ఒకరు ఆలయాన్ని కట్టారు. అందులో ఎంజీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయానికి కుంభాభిషేకం చేశారు. దీంతో బుధవారం కాట్పాడి డీఎంకే అభ్యర్థి, మంత్రి దురైమురుగన్ నేరుగా వెళ్లి పరిశీలించారు. ఎంజీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంజీఎర్ నన్ను చదివించడంతోపాటు తనను పెంచి పోషించారన్నారు. దీంతో అసెంబ్లీలోనూ తనను ఆయనతోపాటు పార్టీకి రావాలని మంత్రి పదవి కూడా ఇస్తానని తెలిపారు. అయినప్పటికీ తాను డీఎంకే పార్టీని వదిలి రాలేనని తేల్చి చెప్పానని చెప్పారు. ఇందుకు తనను ఆయన భుజంపై తట్టి అభినందించారన్నారు. చైన్నె యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎంజీఆర్‌కు గౌరవ డాక్టరేట్ అందజేసేందుకు నిర్ణయించారని, తనతోపాటు డీఎంకే నిర్వాహకులు కలైంజ్ఞర్‌ను సంప్రదించామన్నారు. కలైంజ్ఞర్ సూచన మేరకు యూనివర్సిటీ సిండికేట్ సమావేశంలో తాను తీర్మానం పెట్టానని తెలుసుకున్న ఎంజీఆర్ తనను నేరుగా కలసి చాలా సంతోషించారన్నారు.


