కొరుక్కుపేట: సెమీకండక్టర్ టెక్నాలజీలో పనిచేస్తున్న నిపుణుల కోసం శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఐఐటీ మద్రాసు ప్రవర్తక్, వీఎల్‌ఎస్‌ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ శిక్షణ సంస్థ అయిన మావెన్ సిలికాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఐఐటీ ఎం ప్రవర్తక్ టెక్నాలజీ ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ శంకర్ రామన్ మాట్లాడుతూ సెమీకండక్టర్ పరిశ్రమకు పునాది వంటి తొమ్మిది నెలల వీఎల్ ఎస్‌ఐ డిజైన్, వెరిఫికేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు ఆన్‌లైన్ విధానంలో అందిస్తామని తెలిపారు. మొదటి బ్యాచ్ కోసం అడ్మిషన్లు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. పరిశ్రమ అవసరాలు, జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా సైబర్ –ఫిజికల్ సిస్టమ్స్‌కు ఆధారమైన సెమీకండక్టర్, ఎంబెడెడ్ టెక్నాలజీలలో తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఉద్యోగ నిపుణులకు ఒక విస్తరించదగిన, అందుబాటులో ఉండే మార్గాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. ఇందులో మావెన్ సిలికాన్ వ్యవస్థాపక సీఈవో పిఆర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


