నామినేషన్లకు తెర..! | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లకు తెర..!

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

చివరి రోజున వెయ్యికి పైగా దాఖలు ఎడప్పాడిలో పళణి, విరుదాచలంలో ప్రేమలత బీజేపీ అభ్యర్థులందరూ సమర్పణ తరలి వచ్చిన కేంద్ర మంత్రులు

సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. సుమారు 5 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున ఎడప్పాడిలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి,విరుదాచలంలో డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్‌, సాత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడునైనార్‌ నాగేంద్రన్‌, అవినాశిలో కేంద్ర సహాయ మంత్రి ఎల్‌. మురుగన్‌ నామినేషన్‌లు సమర్పించారు. వివరాలు.. 234 నియోజకవర్గాలతో కూడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం గత నెల 30వ తేదిన ప్రారంభమైన విషయం తెలిసిందే. డీఎంకే, అన్నాడీఎంకేలు కూటమిగా, నామ్‌ తమిళర్‌ కట్చి, టీవీకేలు ఒంటరిగా, పురట్చి తలైవర్‌ మక్కల్‌ కట్చి, పీఎంకే మరో కూటమిగా ఎన్నికల్లోకి వెళ్లాయి. తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో నామినేషన్ల పర్వం శరవేగంగా సాగింది. శనివారం నాటికి 234 అసెంబ్లీ నియోజకవర్గాలలలో 3430 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో పురుషులు 2731, మహిళలు 698 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. ఈ పరిస్థితులలో చివరి రోజైన సోమవారం సుమారు 1700 లకు పైగానామినేషన్లు దాఖలయ్యాయి.

ముఖ్య నేతల దాఖలు

సేలం ఎడప్పాడి నియోజకవర్గంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నామినేషన్‌ సమర్పించారు. చివరి రోజున పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే వర్గాలు నామినేషన్లు వేశారు. 8వ సారి పోటీకి నామినేషన్‌ సమర్పించిన పళణిస్వామి మీడియాతోమాట్లాడుతూ, 234 స్థానాలలో 210 స్థానాలలో అన్నాడీఎంకే కూటమి గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ 15న కన్యాకుమారిలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభలో తాను పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ఇక, డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్‌ కాట్పాడిలో నామినేషన్‌ వేశారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం బోడినాయకనూరు నియోజకవర్గంలో ప్రపథమంగా డీఎంకే అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. డీఎంకేకు చెందిన కొందరు అభ్యర్థులతో పాటుగా ఈ కూటమిలోని కాంగ్రెస్‌ అభ్యర్థులందరూ నామినేషన్‌ సమర్పించారు. ఇక, బీజేపీ అభ్యర్థులందరూ చివరి రోజున నామినేషన్‌ వేశారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో కలిసి మైలాపూర్‌లో తమిళి సై సౌందరరాజన్‌, అవినాశిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర సహాయమంత్రి ఎల్‌ మురుగన్‌ నామినేషన్‌ వేశారు. సాత్తూరులో కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మెహ్వాల్‌తో కలిసి బీజేపీ అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌, రాజస్థాన్‌ సీఎం భజన్‌ లాల్‌ శర్మ, బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలైతో కలిసి కోయంబత్తూరు ఉత్తరం నియోజకవర్గంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్‌తన భర్త విజయకాంత్‌ను తొలిసారిగా అసెంబ్లీకి పంపించిన విరుదాచలం నియోజకవర్గంలో నామినేషన్‌ సమర్పించారు. ధర్మపురిలో పీఎంకే అభ్యర్థిగా సౌమ్య అన్భుమణి నామినేషన్‌ వేశారు. కాగా, అనేక చోట్ల పీఎంకేలో ఓ వైపు అన్భుమణి మద్దతు అభ్యర్థులు, మరో వైపు రాందాసు మద్దతు అభ్యర్థులు నామినేషన్ల సమయంలో కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా, విరుదునగర్‌ రెడ్డియార్‌ పట్టికి చెందిన అమృత పాండి(30) అనే సామాజిక కార్యకర్త స్వతంత్ర అభ్యర్థిగా విరుదునగర్‌లో నామినేషన్‌ దాఖలు చేయడానికి చొక్కా ధరించకుండా అర్ధనగ్నంగా వచ్చాడు. పేదరికాన్ని చాటే విధంగా తాను ఈ విధంగా వచ్చినట్టు పేర్కొన్నా, పోలీసులు అనుమతించ లేదు. చివరకు చొక్కా ధరించి నామినేషన్‌ సమర్పించాడు.

ముగిసిన నామినేషన్ల పర్వం

మార్చి 15న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకాగా, 30వ తేది నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఇందులో మూడు రోజులు సెలవు దినాలు వచ్చాయి. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం మూడు గంటలతో నామినేషన్లు ముగిశాయి. మంగళవారం పరిశీలన జరగనన్నది. ఉప సంహరణ తదుపరి 9వ తేదిన తుది జాబితాను ప్రటించనున్నారు. ఆరు గంటల వరకు అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో 5072 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పురుషులు 4097, మహిళలు 974, ఇతరులు ఒకరు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement