
సోదరా.. కదలిరా!
ఉడన్పెరుప్పే వా...(సోదరా.. కదలిరా) నినాదంతో సీఎం స్టాలిన్ డీఎంకే పార్టీ పరంగా వినూత్న కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలు స్టాలిన్‌ను స్వయంగా కలిసి పరిస్థితులను వివరించే విధంగా ఈ సమాలోచనలు జరుగుతున్నాయి. – సాక్షి, చైన్నె
2026 అసెంబ్లీ ఎన్నికలను డీఎంకే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ అధికారం లక్ష్యంగా వ్యూహాలకు సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పదును పెట్టారు. కూటమి పార్టీలను కలుపుకుని ముందుకెళ్లడమే కాకుండా, ప్రజాహిత కార్యక్రమాలు, క్షేత్ర స్థాయి పర్యటనలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. అదే సమయంలో పార్టీ పరంగా కార్యక్రమాలను విస్తృతం చేయించే విధంగా కార్యాచరణను సిద్ధం చేసి, అమలు చేస్తున్నారు. ఈ పరిస్థితులో నియోజకవర్గాల్లోని పరిస్థితులను అక్కడి పార్టీకి విధేయులుగా ఉన్న నేతల ద్వారా తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు.
సరికొత్త నినాదం
ఈ భేటీకి సోదరా.. కదలిరా అన్న పేరు పెట్టారు. ఈ నినాదంతో శుక్రవారం నుంచి రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో స్టాలిన్ సమావేశం అవుతారు. తొలి రోజున విల్లుపురం, చిదంబరం, ఉసిలం పట్టి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలను పిలిపించారు. వారితో స్టాలిన్ ఒక్కరే కూర్చుని తొలుత అక్కడి నేతల పనితీరు, పార్టీ పరిస్థితులు, పార్టీ పరంగా జరిగే కార్యక్రమాలు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలు ఆర్‌ఎస్ భారతీ, టీకేఎస్ ఇళంగోవన్ తదితరులతో కలిసి మరిన్ని వివరాలను రాబట్టారు. వారు ఇచ్చిన సమాచారాలకు అనుగుణంగా మరింతగా ముందడుగు వేయడానికి స్టాలిన్ సిద్ధమవుతున్నారు.
నియోజకవర్గాల వారీగా నేతలకు పిలుపు
సమావేశంలో సీఎం స్టాలిన్