దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన కల్పిస్తాం : ఎస్పీ
హిందూపురం: దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన దివ్యాంగుల హక్కుల చట్టం–2016 తెలుగు అనువాద పుస్తకాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం ఏ దివ్యాంగుడినీ కించపరిచేలా మాట్లాడినా, భయపెట్టినా శిక్షార్హులవుతారన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ హరినాథరెడ్డి, హిందూపురం నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి షెక్షావలి, న్యాయ సలహాదారుడు ముత్యాలప్ప తదితరులు పాల్గొన్నారు.
పోక్సో కేసు నమోదు
చిలమత్తూరు: మండలంలోని కొడికొండలో ప్రేమ పేరుతో బాలికను వేధింపులకు గురి చేస్తూ చర్చి ప్రాంతంలో బలవంతం చేయబోయిన అదే గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జ్ ఎస్‌ఐ నరేంద్ర తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన వెల్లడించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
నకిలీ ఎరువులు విక్రయిస్తే చర్యలు
తనకల్లు: రైతులకు నకిలీ ఎరువులు, మందులను విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం ఏడీఏ లక్ష్మీనాయక్ హెచ్చరించారు. మండల కేంద్రంతో పాటు కొక్కంటిక్రాస్‌లో ఉన్న ఎరువుల దుకాణాలను బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. మండల కేంద్రంలోని కేఎస్‌ఆర్ ఫర్టీలైజర్, కొక్కంటిక్రాస్‌లో ఉన్న వెంటేశ్వర ఫర్టీలైజర్స్, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫర్టీలైజర్స్‌లో కలిసి రూ. 2.70 లక్షలు విలువైన ఎరువులను స్టాప్‌సేల్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో తనకల్లు, ధర్మవరం ఏఓలు భారతి, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
‘రూ.700 కోట్ల డిపాజిట్ల సేకరణే లక్ష్యం’
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రూ.700 కోట్ల డిపాజిట్ల సేకరణే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్‌చార్జ్ ముంటిమడుగు కేశవరెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక డీసీసీబీ ప్రధాన కార్యాయలంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని బ్రాంచ్ మేనేజర్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. 2026 మార్చి 31 నాటికి నిర్ధేశించుకున్న మేర డిపాజిట్లు సేకరించాలన్నారు. ఇందుకోసం కచ్చితమైన ప్రణాళిక అమలు చేయాలన్నారు. గడువు మీరిన రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఆప్కాబ్ డైరెక్టర్ సురేంద్ర, సీనియర్ మేనేజర్ తేజస్వి, సీఈఓ కె.సురేఖారాణి, డీజీఎంలు పాల్గొన్నారు.
ధర్మవరంలో పట్టపగలే చోరీ
ధర్మవరం అర్బన్: స్థానిక లింగశెట్టిపాళ్యంలో బుధవారం ఉదయం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. ఘటనపై వన్‌టౌన్ పీఎస్‌లో బాధితురాలు మౌలిక ఫిర్యాదు చేసింది. వివరాలు... వర్క్ ఫ్రమ్ హోంలో భాగంగా బుధవారం ఉదయం 8 గంటల సమయంలో టేబుల్‌పై ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ పెట్టి పనిలో నిమగ్నమైన ఆమె.. కాసేపటి తర్వాత మిద్దైపెకి వెళ్లి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో తల్లి, తమ్ముడు లోపల గదిలో ఉండగా బయట గదిలో టేబుల్‌పై ఉంచిన కంపెనీ ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను దుండగుడు అపహరించుకెళ్లాడు. గేటు శబ్దం రావడంతో ఎవరో వచ్చారని కుటుంబ సభ్యులు బయటకెళ్లి చూశారు. గేటు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి బయటి గదిని పరిశీలించారు. టేబుల్‌పై ఉన్న ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో అవి అపహరణకు గురైనట్లుగా నిర్ధారించుకుని వెంటనే చుట్టుపక్కల గాలించినా దుండగుడి ఆచూకీ లభ్యం కాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పీఏబీఆర్‌కు తగ్గిన ఇన్‌ఫ్లో
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) లోకి బుధవారం ఇన్‌ఫ్లో బాగా తగ్గిపోయింది. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా 570 క్యూసెక్కుల చేరుతుండగా, 470 క్యూసెక్కులు తగ్గించారు. దీంతో 100 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతోంది. అలాగే హెచ్చెల్సీ లింక్ చానల్ ద్వారా 150 క్యూసెక్కుల నీరు చేరుతోంది. రిజర్వాయర్‌లో 5.18 టీఎంసీలకు నీటి మట్టం చేరుకోవడంతో రెండు గేట్ల ద్వారా 460 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న మిడ్ పెన్నార్ డ్యామ్‌కు విడుదల చేస్తున్నారు.


