
జబ్బు లేకున్నా ఉందంటూ..
నెలకు రూ.1.50 లక్షల వేతనంతో...
అనంతపురం క్రైం: గుండె వైద్య నిపుణులమంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే జంట ఒకటి అనంతలో పాగా వేసింది. పల్లె ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు పెట్టి లేని జబ్బు ఉన్నట్లుగా చూపి కాసులు పోగేసుకుంటున్న ఈ నకిలీ వైద్యుల బాగోతం ఇటీవల వెలుగు చూసింది. విజయవాడలోని ఓ ప్రముఖ కార్డియో సెంటర్‌లో ఐదేళ్ల పాటు పనిచేశామంటూ ఏకంగా అనంతపురంలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులను సైతం నమ్మించి మోసాలకు తెగబడిన దంపతుల ఉదంతం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, రాజీ వ్యవహారంతో గుట్టుచప్పుడు కాకుండా సద్దుమణిగింది.
వృత్తికి సంబంధంలేని చదువు..
బీకాం పూర్తి చేసిన ఓ యువకుడు, ఇంటర్ వరకూ చదువుకున్న యువతి దంపతులుగా మారి తాము వైద్యులమంటూ అనంతపురంలోని పలు ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇంతకాలం సేవలు అందిస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం కోర్టు రోడ్డులో మూతపడిన ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలోనూ వీరు పనిచేశారు. అయితే ఆలస్యంగా వీరు నకిలీలుగా గుర్తించిన ఆస్పత్రి యాజమాన్యం అక్కడి నుంచి వీరిని తరిమేసింది. దీంతో ఆదిమూర్తినగర్‌లోని మరో ప్రముఖ ఆస్పత్రి నిర్వాహకుడిని కలసి తాము విజయవాడలోని ఓ ప్రముఖ కార్డియో సెంటర్‌లో ఐదేళ్లపాటు పనిచేశామని, అక్కడ వేతన విషయంలో గొడవలు తలెత్తడంతో అనంతపురానికి వచ్చినట్లు వివరించి, తమకు అవకాశం కల్పిస్తే ఆస్పత్రి కీర్తిప్రతిష్టలను మరింత పెంచుతామని భరోసానిచ్చారు. వారి మాటలు నమ్మి కలిసి పనిచేసేందుకు ఆస్పత్రి నిర్వాహకులు అంగీకరించారు.
హెల్త్ క్యాంపుల పేరుతో ఉమ్మడి జిల్లా
పల్లె వాసులకు బురిడీ
నగరంలోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో వైద్యులమంటూ టోకరా
ప్రముఖ కార్డియో సెంటర్‌లో
ఐదేళ్ల అనుభవమంటూ బీరాలు
తాజాగా అనంతలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యానికి టోపీ
బకాయి వేతనాలు చెల్లించాలంటూ ఎదురు దాడి
తాము పనిచేస్తున్న ఆస్పత్రి తరఫున ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ మొత్తం 11 వైద్య శిబిరాలను నకిలీ వైద్య దంపతులు నిర్వహించారు. వజ్రకరూరు మండలం తట్రకల్లు, బత్తలపల్లి మండలం నిడిగల్లు, దాడితోట తదితర గ్రామాల్లో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 8 మందికి గుండె సంబంధిత జబ్బులున్నాయని, అనంతపురంలో తాము పనిచేస్తున్న ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలంటూ సిఫారసు చేశారు. దీంతో బెంబేలెత్తిన సదరు గ్రామీణులు తమకు తెలిసిన వైద్యుడిని సంప్రదిస్తే అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించిన అనంతరం వారికి ఎలాంటి జబ్బులూ లేవని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు బాధితులు నేరుగా అనంతపురంలోని ఆదిమూర్తినగర్‌లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకుని నిర్వాహకులను నిలదీశారు. దీంతో అవాక్కయిన ఆస్పత్రి నిర్వాహకులు నకిలీ వైద్య దంపతులను ప్రశ్నించడంతో సమాధానం ఇవ్వకుండా దాటవేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారి సర్టిఫికెట్లు చూపాలని నిర్వాహకులు డిమాండ్ చేయడంతో తమకు అవమానం జరిగిన చోట ఒక క్షణం కూడా ఉండమంటూ దంపతులు వెళ్లిపోయారు. అనంతరం బకాయి వేతనం చెల్లించాలంటూ వేధింపులకు తెరలేపారు. వేధింపులు తాళలేక చివరకు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎస్పీకి నేరుగా ఆస్పత్రి నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఓ సీఐ వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేసినట్లు తెలిసింది.
కార్డియాలజిస్ట్‌గా తాను పనిచేయాలంటే నెలకు రూ.1.50 లక్షల వేతనంతో పాటు వైద్య శిబిరాలకు వెళ్లేందుకు కారు, ఇతర ఖర్చులు భరించాలని ఆ యువకుడు కండీషన్ పెట్టాడు. తన భార్య ఫార్మా–డీ (డాక్టర్ ఆఫ్ ఫార్మసీ) చేసిందని, ఆమె కూడా తనతో పాటు క్యాంప్‌లకు వస్తుందని, ఇందుకు గాను ఆమెకు రోజుకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని ఒప్పందం చేసుకుని, ఈ ఏడాది మార్చిలో ఆస్పత్రి నిర్వాహకులన నుంచి మొత్తం రూ.3.50 లక్షలను అడ్వాన్స్‌గా తీసుకుని విధుల్లోకి చేరారు.