
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సహజ వనరుల లూటీ విచ్చలవిడిగా జర
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మట్టి, ఇసుక, గ్రావెల్ తదితర వాటిని వాణిజ్య అవసరాలకు తరలించే వాహనాల నుంచి రాయల్టీ డబ్బు వసూలు చేసేందుకు ప్రభుత్వం ఏదైనా ప్రైవేటు సంస్థకు లీజు కట్టబెట్టేది. లీజు దక్కించుకున్న సంస్థ నెలానెలా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో కొంత మొత్తం చెల్లించేది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం లభించేది. అయితే, జిల్లాలో ప్రైవేటు సంస్థ లీజు గడువు మార్చితోనే ముగిసింది. తర్వాత ఇప్పటివరకూ ఎవ రికీ ఇవ్వలేదు. దీంతో అప్పటి నుంచి సహజ వనరుల అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
11 మాసాల్లోనే కొండల నేలమట్టం..
‘కూటమి’ అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే అనంతపురం సమీప ప్రాంతాల్లో కొండలు కరిగిపోయాయి. గుట్టలు నేల మట్టమయ్యాయి. రాప్తాడు నియోజకవర్గంలోని క్రిష్ణంరెడ్డి పల్లి గుట్టలను కరిగించేశారు. రోజూ ఇక్కడి నుంచి వంద నుంచి 150 టిప్పర్ల మట్టి కర్ణాటకకు పంపిస్తున్నారు. ఇక్కడికి ఇద్దరు మైనింగ్ అధికారులు వెళ్లి వెనక్కు వచ్చారు. మహిళా అధికారులు మట్టి దొంగలను నిలువరించలేకపోయారు. ఇక.. ఆలమూరు కొండలంటే ఈ ప్రాంతంలో ప్రసిద్ధి. పశుపక్ష్యాదులకు ఆలవాలంగా ఉండటమే కాదు రాప్తాడు, అనంతపురం ప్రాంతాలకు రక్షణ కవచంలా ఉండేవి. అలాంటి కొండలను నేలమట్టం చేశారు. చివరకు కరెంటు పోళ్లు కూడా కిందపడిపోయేలా మట్టిని తవ్వారు. స్థానిక టీడీపీ నేత ఆధ్వర్యంలో అక్రమ వ్యవహారం ఇష్టారాజ్యంగా జరుగుతోంది.
కరిగిపోయిన నేమకల్లు గుట్టలు
రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లులో జరుగుతున్న మైనింగ్.. రాష్ట్ర చరిత్రలోనే పెద్దదిగా చెప్పొచ్చు. మైనింగ్ డాన్‌గా పేరుగాంచిన టీడీపీ నేతలిద్దరు భారీగా క్రషర్‌లు పెట్టి కొండలను పిండి చేస్తున్నారు. ఆరు హెక్టార్లు లీజు ఉంటే 50 ఎకరాల్లో తవ్వుతున్నారు. రూ.20 కోట్ల పెనాల్టీ వేస్తే దాన్ని మాఫీ చేయించుకునేందుకు యత్నిస్తున్నారు.
‘తాడిపత్రి’లో విచ్చలవిడిగా...
తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో ఇసుక, మట్టి దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. పెద్దపప్పూరు మండలంలోని సోమనపల్లి, తిమ్మనచెరువు గ్రామాల్లో విచ్చలవిడిగా మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకునేవారే లేరు.
ఆత్మకూరు మండలంలో తారస్థాయికి..
ఆత్మకూరు మండలంలో ఎర్రమట్టి దందా తారస్థాయికి చేరింది. ‘తెలుగు తమ్ముళ్లు’ మట్టి దందాను అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డు ప్రాంతం మొత్తం ఇప్పటికే వెంచర్లతో నిండిపోయింది. ఈ క్రమంలో ఆత్మకూరు మండలం వడ్డుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఎలాంటి గ్రావెల్ లీజులు లేకుండానే కొండలను పిండి చేసి అక్రమంగా మట్టి రవాణా సాగిస్తున్నారు.
హిందూపురంలో పట్ట పగలే దోపిడీ..
హిందూపురం పట్టణం చుట్టూ ఉన్న రూరల్ ప్రాంతాల నుంచి మట్టి యథేచ్ఛగా కర్ణాటకకు తరలిస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకుంటున్నా వినకుండా మట్టి తోలుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల అండగా తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ఎక్కడ చూసినా మట్టి, ఇసుక టన్నుల కొద్దీ కర్ణాటకకు వెళ్లిపోతోంది.
ధర్మవరం నియోజకవర్గంలో..
ధర్మవరం నియోజకవర్గలోని చిత్రావతి నది నుంచి రోజూ వందలాది టిప్పర్ల ఇసుక అక్రమంగా తోలుతున్నా పట్టించుకునే దిక్కులేదు. ప్రధాన హైవేలోనే నిర్భయంగా టిప్పర్లు వెళుతున్నా రెవెన్యూ అధికారులు గానీ, మైనింగ్ అధికారులు గానీ వాహనాలను పట్టుకోలేదు. టీడీపీ వాహనాలు అనగానే పోలీసులు వాటికి రాచబాట వేసి మరీ బార్డరు దాటిస్తున్నారు.
సహజ వనరుల స్వాహాపర్వం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో విచ్చలవిడిగా దోపిడీ
రోజూ వందలాది టిప్పర్ల ఇసుక, మట్టి కర్ణాటకకు
కొండలు కరిగిపోతున్నా.. గుట్టలు నేలమట్టమవుతున్నా ఎవరికీ పట్టని వైనం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో సహజ వనరుల లూటీ విచ్చలవిడిగా జర