జగన్ పర్యటన విజయవంతంపై ఉషశ్రీచరణ్
గోరంట్ల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ తెలిపారు. ఆ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబీకులను పరామర్శించేందుకు మంగళవారం వైఎస్ జగన్ కల్లితండా రాగా, జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేశారన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి అశేష ప్రజానీకం వచ్చి జగన్‌మోహన్‌రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమ విజయానికి శక్తి వంచనలేకుండా కృషి చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.
‘ఓపెన్’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి
● డీఆర్‌ఓ విజయ సారథి ఆదేశం
ప్రశాంతి నిలయం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్‌ఓ విజయ సారథి ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఓపెన్ పది, ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మే 19 నుంచి 24వ తేదీ వరకు ఓపెన్ పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయన్నారు.
జిల్లా నుంచి 7,056 మంది విద్యార్థులు పరీక్ష హాజరుకానుండగా, 45 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ షాపులను మూసివేయించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదన్నారు. సమావేశంలో డీఈఓ కృష్టప్ప, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక పీఠం అధికారులు పాల్గొన్నారు.
ముజఫర్ అలీ కన్నుమూత
కదిరి: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కదిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ముజఫర్ అలీ(62) బుధవారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమైన ఆయన... రెండేళ్లుగా భార్యతో కలిసి కర్నూలు జిల్లా ఆదోనిలో ఉంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడే కన్నుమూశారు. ఆయన తండ్రి నిజాంవలీ కదిరి మున్సిపల్ చైర్మన్‌గా, రాష్ట్ర మంత్రిగా కూడా పని చేశారు. తండ్రి మరణానంతరం ముజఫర్ అలీ చిన్న వయసులోనే కదిరి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికై ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నారు.
ముజఫర్ అలీ మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు ఆదోనికి వెళ్లి భౌతిక కాయాన్ని కదిరికి తీసుకొచ్చి ఖననం చేశారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, అభిమానులు ముజఫర్ అలీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.