
మడకశిరలో ప్రజాస్వామ్యం ఖూనీ
మడకశిర: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పెత్తనం చేసేందుకు ఎంతకై నా దిగజారుతున్నారు. ఈ క్రమంలోనే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ చేజిక్కించుకున్న స్థానాలను సొంతం చేసుకునేందుకు దిగజారి రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల అడ్డదారుల్లో పీఠాలను దక్కించుకున్న టీడీపీ నేతలు మడకశిర మున్సిపాలిటీని అప్రజాస్వామికంగా కై వసం చేసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు.
ఐదుగురితో అధికారం దక్కించుకోవాలని..
మడకశిర మున్సిపాలిటీలో 20 వార్డులుండగా... గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 15 స్థానాల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో చైర్‌పర్సన్‌గా దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్‌గా రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. వీరిద్దరినీ ఎలాగైనా పదవుల నుంచి తప్పించాలని టీడీపీ నేతలు ప్లాన్ వేశారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి 8 మందికి పచ్చ కండువా కప్పారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన ఐదుగురితో పాటు పార్టీ ఫిరాయించిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకోవాలని చూస్తున్నారు.
నేడు చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం..
మడకశిర మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డిపై గురువారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు టీడీపీ నేతలు సర్వం సిద్ధం చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక సమావేశానికి ప్రిసైడింగ్ అధికారి హోదాలో పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్ హాజరు కానున్నారు.
వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు విప్ జారీ..
అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వైఎస్సార్ సీపీకి చెందిన 15 మంది కౌన్సిలర్లకు పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విప్ జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్, మడకశిర మున్సిపల్ కమిషనర్ రంగస్వామికి మడకశిర వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప, పార్టీ నాయకుల ద్వారా అందజేశారు. అదే విధంగా కౌన్సిలర్లకు కూడా విప్ పత్రాలను అందజేశారు.
అడ్డదారుల్లో మున్సిపాలిటీ
కై వసానికి కూటమి కుట్ర
వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు ప్రలోభాలు.. క్యాంపునకు తరలింపు
నేడు మున్సిపల్ చైర్ పర్సన్,
వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం
వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు
విప్ జారీ చేసిన పార్టీ హైకమాండ్
విప్ ధిక్కరిస్తే పదవులకు చేటే
మడకశిరలో టీడీపీ నాయకులు అంబేడ్కర్ రాజ్యాంగానికి తిలోదకాలు ఇచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి అడ్డదారుల్లో మున్సిపాలిటీని కై వసం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం దారుణం. మేం 15 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు విప్‌జారీ చేశాం. ధిక్కరిస్తే కౌన్సిలర్ పదవులు కోల్పోవడం తథ్యం. – ఈరలక్కప్ప,
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మడకశిర

మడకశిరలో ప్రజాస్వామ్యం ఖూనీ