
మహిళా సమస్యలపై ఉద్యమాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): మహిళా సమస్యలపై ఉద్యమాలు చేపట్టేందుకు సంబంధించిన కార్యాచరణ నిమిత్తం ఐద్వా మహాసభలను నిర్వహిస్తున్నామని జిల్లా, నగర కార్యదర్శులు మస్తాన్‌బీ, కత్తి పద్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ దుగ్గిరాల అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు. ఐద్వా నగర 16వ మహాసభలను గుర్రాలమడుగు సంఘంలోని జక్కా పార్వతమ్మ, బీబీజాన్ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ఐద్వా పతాకాన్ని ఆవిష్కరించి.. వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ పేరుతో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఐద్వా జిల్లా, నగరాధ్యక్షులు సుబ్బమ్మ, శివకుమారి, రూరల్ అధ్యక్షురాలు వరలక్ష్మి, నేతలు భాగ్యమ్మ, నాజున్నీ, ఆదిలక్ష్మి, మహ్మదా, షాహిన్, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు రజిని, కామాక్షమ్మ తదితరులు పాల్గొన్నారు.