
గ్రామసభలు పెట్టకుండా భూములెలా ఇస్తారు?
● ఇండోసోల్ కంపెనీకి
చంద్రబాబు బినామీనా?
● భూ కబ్జాదారులకు అండగా కూటమి ప్రభుత్వం
● వామపక్ష నేతలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు కంపెనీలకు కేటాయించాలంటే గ్రామసభలు నిర్వహించాలి. రైతుల అభిప్రాయాలు తీసుకుని వారి అనుమతితో భూములను కేటాయించాలి. కానీ కూట మి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రైతుల భూములు, గ్రామాలను ఇండోసోల్ సోలార్ కంపెనీకి కేటాయించడం చట్ట విరుద్ధం’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) సీనియర్ నాయకులు రాంబాబు అన్నారు. నెల్లూరులోని బాలాజీ నగర్‌లో సీపీఎం జిల్లా కార్యాలయంలో గురువారం వామపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం కలెక్టర్ కరేడు గ్రామానికి వెళ్లనున్నారన్నారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన తీవ్ర నిరసనతో ఇప్పుడు ప్రభుత్వం గ్రామాల్లో అభిప్రాయసేకరణ చేపట్టేందుకు సిద్ధపడిందన్నారు. గతంలో కూడా జిల్లాలోని ముత్తుకూరు, రాచర్లపాడు గ్రామాల్లో కంపెనీలకు వందలాది ఎకరాలు కట్టపెట్టారని అయితే సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి పరిశ్రమలు రాలేదని ఆరోపించారు. ఈ భూములను బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ.వందల కోట్లు రుణాలు తీసుకుని ఎగనామం పెట్టే భూకబ్జాదారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని ఆరోపించారు. 8,464 ఎకరాలు ఇవ్వడం చూస్తుంటే సదరు కంపెనీకి చంద్రబాబు బినామీగా ఉన్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. ఒక సంస్థకు భూములు ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు అధికంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అందుకు భిన్నంగా తాము ఎంత ఇస్తే అంతే తీసుకుని భూములు, గ్రామాలు ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించి పోలీసు కేసులు పెట్టి భూములను స్వాధీనం చేసుకుంటామంటే ఒప్పుకొనేది లేదన్నారు. కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు రైతులకు తన సొంత నగదుతోపాటు, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పిస్తానని చెబుతున్నాడని, ఆయనే నియోజకవర్గ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా భూములు స్వాధీనం చేసుకునేందుకు పోలీసు కేసులు పెట్టి రైతులు, ప్రజలను బెదించడం సరికాదన్నారు. ప్రజలతో పెట్టుకుంటే ఎమ్మెల్యే నియోజకవర్గంలో తిరగలేడని హెచ్చరించారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భూములను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షాన్‌వాజ్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు, ఎస్‌యూసీఐ నాయకుడు సురేష్ పాల్గొన్నారు.