
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
వరికుంటపాడు: మండలంలోని తూర్పు బోయమడుగు ప్రాథమికోన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు వెంగయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను డీఈఓ బాలాజీరావు గురువారం జారీ చేశారు. దీన్ని ప్రధానోపాధ్యాయుడికి ఎంఈఓలు రమేష్, రమణయ్య అందజేశారు. పాఠశాలలో బాలికలతో వెంగయ్య అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ గ్రామస్తులు రెండు రోజుల క్రితం దేహశుద్ధి చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి నివేదిక పంపారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటేశారు.
రొట్టెల పండగకు
పటిష్ట బందోబస్తు
నెల్లూరు సిటీ: రొట్టెల పండగకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నామని ఎస్పీ కృష్ణకాంత్ పేర్కొన్నారు. బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. పరిసరాలు, కంట్రోల్ రూమ్, వాహన పార్కింగ్ ప్రదేశాల్లో చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్గా మార్గంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఘాట్ ఏరియా, రొట్టెల మార్పిడి చేసే ప్రదేశాలను సందర్శించారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.