
‘సుపరిపాలన’కు ఎమ్మెల్యేల డుమ్మా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం ఏడాది ‘సుపరిపాలనకు తొలిఅడుగు’ కార్యక్రమానికి తొలిరోజు బుధవారం జిల్లాలో మొక్కుబడిగా జరిగింది. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తమ నియోజకవర్గాల్లో, కావలిలో దగుమాటి కృష్ణారెడ్డి పట్టుమని పది ఇళ్లు కూడా తిరగకుండానే మొక్కుబడిగా నిర్వహించి మమ అనిపించారు. ఉదయగిరి, కందుకూరు ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు విదేశాలకు చెక్కేశారు. స్థానికంగా ఉన్నప్పటికీ సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అసలు కార్యక్రమాన్నే ప్రారంభించలేదు.
అర్ధరాత్రి దర్గా కూల్చేశారు
నెల్లూరు రూరల్: నెల్లూరు వెంకటేశ్వరపురంలోని మస్తానీ అమ్మవారి దర్గాను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంజినీరింగ్ అధికారులు గత నెల 30వ తేదీ రాత్రికి రాత్రే కూల్చి వేశారని కమిటీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో కమిటీ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మస్తానీ అమ్మవారి దర్గాలో గత 40 సంవత్సరాల నుంచి నిత్యం పూజలు చేస్తూ సేవ చేసుకునే వారమని తెలిపారు. ఈ దర్గా 15 అంకణాల స్థలంలో ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా కూడా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ముక్తియార్, సాజిదా, దస్తగిరి యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దాస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ మాధవి
నెల్లూరు (అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి) సూపరింటెండెంట్‌గా (ఎఫ్‌ఎసీ) బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ కె.మాధవిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నియమించింది. ఆమె బుధవారం ఆస్పత్రిలో బాధ్యతలు స్వీకరించారు. ఆమె ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గాను, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్‌గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె కళాశాలలో సౌమ్యురాలిగా, నిజాయితీ గల అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్‌బాషా, అడ్మినిస్ట్రేషన్ అధికారి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
రైతుల పోరాటానికి
అండగా ఉంటాం
● కరేడులో వామపక్ష నేతల పర్యటన
ఉలవపాడు: భూ సేకరణకు వ్యతిరేకంగా ఉద్యమి స్తున్న కరేడు గ్రామ రైతులకు వామపక్ష పార్టీలు అండగా ఉంటాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వంకాయలపాటి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీ ప్రసాద్ అన్నారు. వామపక్ష పార్టీలు, అనుబంధ ప్రజాసంఘాల నాయకులు కరేడు పంచాయితీ పరిధిలోని రామకృష్ణపురం, ఉప్పరపాళెం, అలగాయపాళెం, కరేడు, పొట్టేళ్లగుంటలో బుధవారం వారు పర్యటించి ప్రజలతో మాట్లాడారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వ కుండా, గ్రామసభ నిర్వహించకుండా భూ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. మూడు పంటలు పండే పచ్చని భూములు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం వెనుక కుట్ర ఉందన్నారు. గతంలో ఇదే కంపెనీకి భూములు ఇస్తుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు అదే కంపెనీకి 8,348 ఎకరాలు కేటాయించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. గత నెల 29న జరిగిన రాస్తారోకోలో పోలీసులను తోసివేసి రోడ్డెక్కిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా కరేడు రైతుల పోరాట పటిమను తెలియ చేసిందన్నారు. వరి, మామిడి, సపోట, వేరుశనగ, కూరగాయలు పండించే రైతుల భూమిని తీసుకోవడానికి ఒప్పుకోమన్నారు. సీపీఎం నెల్లూరుజిల్లా కార్యదర్శి మూలం రమేష్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆండ్రామాల్యాద్రి, సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, రైతు సంఘం ప్రకాశంజిల్లా కార్యదర్శి హనుమారెడ్డి, సీపీఐ ఎంఎల్ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సాగర్, పీఓడబ్ల్యూ నాయకురాలు పద్మ, ఈసీసీఐ నాయకులు ఆనంద్, ఆర్‌యస్‌పీ నాయకులు సురేష్, సీపీయం నాయకులు కుమార్ పాల్గొన్నారు.

‘సుపరిపాలన’కు ఎమ్మెల్యేల డుమ్మా

‘సుపరిపాలన’కు ఎమ్మెల్యేల డుమ్మా