
నోటీసులను జారీ చేస్తాం
జిల్లాలో ఎలాంటి గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న కళాశాలలను పరిశీలించి, నోటీసులను జారీ చేస్తాం. తరగతులు, హాస్టల్‌ను నిలిపేయాలంటూ ఓవెల్ యాజమాన్యానికి తెలియజేశాం. అక్కడి నుంచి తొలగించకపోతే విషయాన్ని ఇంటర్ బోర్డు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతాం. అనుమతుల్లేకుండా నిర్వహించకూడదు.
– వరప్రసాదరావు, ఆర్‌ఐఓ
జిల్లాలో కార్పొరేట్ యాజమాన్యాల ధనదాహానికి అడ్డే లేకుండాపోతోంది. ఇంటర్ బోర్డు గుర్తింపు లేకుండానే బ్రాంచీలను విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఫీజులను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నా, దానికి తగిన విధంగా వసతులను కల్పించడంలో దారుణంగా విఫలమవుతున్నారు. బోర్డు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ పుస్తకాలు, యూనిఫారాలను విక్రయిస్తున్నా, ప్రేక్షకపాత్రకే అధికారులు పరిమితమవుతున్నారు. ముడుపులను పుచ్చుకుంటూ.. అంతా సక్రమమనే రీతిలో వారు వ్యవహరిస్తున్నారు.
అనుమతి లేకుండానే నిర్మాణంలో ఉన్న ఓవెల్ కళాశాల భవనం
జిల్లాలో 140కుపైగా జూనియర్ కళాశాలలున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 45 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. నీట్, ఐఐటీ లాంగ్ టర్మ్ కోచింగ్‌ను మరో రెండు వేల మంది వరకు పొందుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా కళాశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తూ జిల్లా వ్యాప్తంగా పలు బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే వీటికి ప్రభుత్వ గుర్తింపు ఉండటంలేదు. మెయిన్ బ్రాంచీల్లో సెక్షన్లకే పర్మిషన్లు పొంది విడిగా బ్రాంచీలను ఏర్పాటు చేసి వీలైనంత ఎక్కువ మందిని చేర్చుకుంటున్నారు. గాలి, వెలుతురు లేకుండా ఆపార్ట్‌మెంట్లలో క్లాసులను నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడు తున్నారు. ఫైర్, సౌండ్‌లెస్, ఎన్‌ఓసీ తదితర సర్టిఫికెట్లు వీటికి ఉండవు. ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థుల పరిస్థితి ఏమిటో అంతుచిక్కడంలేదు.
●
మంత్రి గారి కళాశాలలా.. వామ్మో
కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలను ఆయా యాజమాన్యాలు వ్యాపార కేంద్రాలుగా మార్చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విద్యాసంవత్సరంలో ఫీజులను 20 నుంచి 30 శాతం మేర పెంచేశారు. డే స్కాలర్, హాస్టల్, కళాశాలను బట్టి ఒక్కొక్కరి వద్ద రూ.35 వేల నుంచి రూ.మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అదే మంత్రి నారాయణ కళాశాలల్లో అయితే వసూళ్లలో నియంత్రణే ఉండదు. దీంతో పాటు కాలేజీని బట్టి పుస్తకాలకు రూ.పది వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. యూనిఫారానికి రూ.ఆరు వేల నుంచి రూ.ఎనిమిది వేలు.. ల్యాబ్‌కు రూ.రెండు వేలను సమర్పించాల్సిందే. మరోవైపు కాలేజీల్లోనే క్యాంటిన్లను యాజమాన్యాలు ఏర్పాటు చేశాయి. బయట కంటే రెట్టింపు ధరలకు ఇక్కడ విక్రయిస్తున్నారు. విరామ సమయంలో విద్యార్థులను కళాశాల బయటకు అనుమతించకపోవడంతో గత్యంతరం లేక కొనుగోలు చేయాల్సి వస్తోంది.
ఇంటర్ బోర్డు
గుర్తింపు లేకుండానే విచ్చలవిడిగా ఏర్పాటు
నిర్మాణం జరుగుతుండగానే..
తరగతులు, హాస్టల్ నిర్వహణ
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
చివరికి అపార్ట్‌మెంట్లలోనూ క్లాసులు
కార్పొరేట్ యాజమాన్యాల ఆగడాలు
ముడుపులతో మౌనం వహిస్తున్న
అధికారులు
నెల్లూరు(టౌన్): ఇంటర్ విద్యను రాష్ట్రంలో అపహాస్యం చేస్తున్నారు. కాసులు సమర్పిస్తే.. ఎక్కడైనా బ్రాంచీలను ఏర్పాటు చేసేందుకు అధికారులు గ్రీన్ సిగ్నలిస్తున్నారు. తమ పిల్లలు బాగా చదివి.. ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తల్లిదండ్రుల ఆశలను చక్కగా క్యాష్ చేసుకుంటూ.. వారికి వసతులను కల్పించడంలో ఏ మాత్రం ఆసక్తి చూపడంలేదు.
ఇదో ఉదాహరణ..
నెల్లూరు రూరల్ పరిధిలోని గొలగమూడి రోడ్డులో ఇథాకా స్కూల్ సమీపంలో ఓవెల్ జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ కాలేజీ భవన నిర్మాణం జరుగుతుండగా, అక్కడ దాని పేరే లేదు. మరోవైపు ప్రభుత్వ గుర్తింపు లేకపోయినా, సదరు భవనంలో తరగతులు, హాస్టల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ భవన సముదాయంలో వందలాది మంది విద్యార్థులు నిత్యం తిరుగుతుంటారు. నిర్మాణ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి వారు ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. జిల్లాలోని పలు కార్పొరేట్ యాజమాన్యాలు ఇదే తరహాలో విచ్చలవిడిగా బ్రాంచీలను ఏర్పాటు చేసి తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఇంటర్ బోర్డు అధికారులకు తెలియజేసినా, లైట్ తీసుకుంటున్నారు.
జిల్లాలో ఇలా..