
భూసేకరణకు వ్యతిరేకంగా..
● అర్జీలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న రైతులు●
● నేడు కరేడులో గ్రామసభ
ఉలవపాడు: భూ సేకరణ కోసం ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేస్తున్న గ్రామసభలో భారీగా అర్జీలు అందించి నిరసన తెలియజేయాలని రైతులు సిద్ధమవుతున్నారు. గురువారం కరేడు గ్రామంలో పెద్ద సంఖ్యలో అర్జీలు రాశారు. ప్రభుత్వం రైతులకు భూ సేకరణ గ్రామసభ ఉందని సమాచారం ఇవ్వకపోయినా.. వారు మాత్రం తెలుసుకుని మరీ తమ అభ్యంతరాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వడంపై రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ భూములు ఇవ్వమని రోడ్డెక్కడంతోనే ప్రభుత్వం దిగొచ్చి గ్రామసభను ఏర్పాటు చేసింది. ఈ పరిస్థితుల్లో సభను సంపూర్ణంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో రైతులున్నట్లు సమాచారం. ప్రతి ఒక్కరూ ఎవరికి వారే అభ్యంతరం తెలియజేయడానికి అర్జీలను రూపొందించుకుంటున్నారు. భూమి లేకపోతే తాము బతకలేమని, భూములు, ఇళ్లు ఇచ్చేది లేదని కచ్చితంగా చెప్పేలా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కూటమి ప్రభు త్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎందాకై నా పోరాడేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు రైతులకు మద్దతు తెలుపుతున్నాయి.
గోడు వినిపించనున్న రైతులు
శుక్రవారం కరేడులో జరిగే గ్రామసభకు కలెక్టర్ ఆనంద్, సబ్ కలెక్టర్ శ్రీపూజ, తహసీల్దార్ శ్రీనివాసరావు వస్తున్నట్లు సమాచారం. ఇందులో రైతులు తమ బాధలను అర్జీల రూపంలో తెలియజేయనున్నారు. కరేడు రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు, కాంగ్రెస్‌తోపాటు పలు పా ర్టీలు మద్దతు ఇస్తున్నాయి. కూటమి పార్టీలు తప్ప మిగిలినవి భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఆయా పార్టీలు కూడా అర్జీలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకోసం రైతులతో కలిసి మాట్లాడి వారి అభిప్రాయాన్ని పార్టీ తరఫున అందజేయనున్నారు. వైఎస్సార్‌సీపీ కరేడు రైతుల కోసం ఎంత వరకై నా పోరాడడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో సభకు పోలీసు బందోబస్తు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది.