
బులవాయో వేదికగా జింబాబ్వేతో రెండో టెస్టును న్యూజిలాండ్ కేవలం మూడు రోజుల్లోనే ముగించింది. ఆతిథ్య జింబాబ్వేను ఇన్నింగ్స్ అండ్ 359 పరుగులతో తేడాతో కివీస్ చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అరంగేట్ర ఆటగాడు జకారీ ఫౌల్కేస్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.
మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 75 పరుగులు మాత్రమే ఇచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఫౌల్కేస్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కివీస్ తరపున అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు సాధించిన ప్లేయర్‌గా ఫౌల్కేస్ చరిత్ర సృష్టించాడు.
ఇంతకుముందు ఈ రికార్డు కివీ స్పీడ్ స్టార్ విల్ ఓ'రూర్కే పేరిట ఉండేది. గతేడాది హామిల్టన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రూర్కే 93 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో రూర్కే ఆల్‌టైమ్ రికార్డును జకారీ బ్రేక్ చేశాడు.
ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్‌లో ఈ రికార్డు భారత మాజీ స్పిన్నర్ నరేంద్ర హిర్వానీ పేరిట ఉంది. హిర్వానీ 1988లో మద్రాసు (ఇప్పుడు చెన్నై) వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు కేవలం 136 పరుగులు మాత్రమే ఇచ్చి 16 వికెట్లు సాధించాడు.
సిరీస్ వైట్ వాష్..
కాగా జింబాబ్వేతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ వైట్ వాష్ చేసింది. ఈ రెండో టెస్టులో మాట్ హెన్రీ సైతం నిప్పులు చెరిగాడు. హెన్రి రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 7 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో డెవాన్ కాన్వే (245 బంతుల్లో 153) ,హెన్రీ నికోల్స్(150 నాటౌట్), రచిన్ రవీంద్ర(165 నాటౌట్) భారీ సెంచరీలతో చెలరేగారు.