
అప్పుడే ఆట మెరుగుపడుతుంది
చెస్ డబ్ల్యూజీఎం తానియా వ్యాఖ్య
చెన్నై: మహిళల చెస్‌లో భారత క్రీడాకారిణులు ముందంజ వేయాలంటే ఎక్కువ సంఖ్యలో ఓపెన్ టోర్నీల్లో పాల్గొనాలని సీనియర్ ప్లేయర్, ఉమెన్ గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) తానియా సచ్‌దేవ్ అభిప్రాయపడింది. మహిళల టోర్నీలకు పూర్తిగా దూరం కావద్దని... అయితే పురుషులతో ఓపెన్ కేటగిరీలో పోటీ పడితే ఆట ఎంతో మెరుగవుతుందని ఆమె వ్యాఖ్యానించింది. గత ఏడాది చెస్ ఒలింపియాడ్ నెగ్గిన భారత జట్టులో సభ్యురాలైన తానియా... ప్రస్తుతం చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.
‘చెస్ కెరీర్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అమ్మాయిలు సాధ్యమైనన్ని ఎక్కువ ఓపెన్ టోర్నమెంట్‌లలో ఆడాలి. కేవలం మహిళల టోర్నీలకే పరిమితం కాకుండా పురుషులతో కలిసి శిక్షణ పొందడంతో పాటు వారితో పోటీ పడాలి. అప్పుడే వారి ఆట మరింత పదునెక్కుతుంది’ అని తానియా పేర్కొంది. అయితే పెద్ద స్థాయికి చేరే ముందు మహిళా టోర్నీల్లో విజయాలు సాధించడం కూడా ముఖ్యమని, అవి కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు కావాల్సిన ప్రేరణను అందిస్తాయని తానియా చెప్పింది. ‘మహిళల విభాగంలో సాధించే విజయాలను కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు.
ఇవి కొత్త తరం అమ్మాయిలు చెస్‌ను ఎంచుకునేందుకు కావాల్సిన స్ఫూర్తిని ఇస్తాయి. ఓపెన్ టోర్నీల్లో పాల్గొనడం, మహిళల టోర్నీల్లో టైటిల్స్ గెలవడం రెండూ కూడా ముఖ్యమే. ఏదీ తక్కువ కాదు. సరిగ్గా చెప్పాలంటే కెరీర్‌లో ఎదిగే సమయంలో ఇది మధ్యేమార్గంలాంటిది. అయితే కేవలం మహిళల టోర్నీల్లోనే పాల్గొంటే వారు తమ స్థాయిని తగ్గించుకున్నట్లే. పూర్తి స్థాయిలో తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని వారు కోల్పోతారు’ అని 38 ఏళ్ల తానియా విశ్లేషించింది. అంతర్జాతీయ స్థాయిలో మన మహిళా చెస్ క్రీడాకారిణుల తాజా ప్రదర్శన పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
‘ఫిడే’ వరల్డ్ కప్ ఫైనల్లో తలపడిన కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్‌లపై ఆమె ప్రశంసలు కురిపించింది. ‘మన దేశానికి సంబంధించి ఇప్పుడు చెస్‌లో స్వర్ణ యుగం నడుస్తున్నట్లుగా ఉంది. ఇలాంటి సమయంలో మేమేం తక్కువ కాదన్నట్లుగా మహిళలు నిరూపించుకుంటున్నారు. ఒక మెగా టోర్నీ ఫైనల్లో రెండు వేర్వేరు తరాలకు చెందిన భారత ప్లేయర్లు పోటీ పడటం మామూలు విషయం కాదు.
చెస్‌ను చూసి ఈ ఆటను ఎంచుకోవాలనుకునే అమ్మాయిలకు ఇది కావాల్సినంత స్ఫూర్తిని అందిస్తుంది’ అని తానియా అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్నా తనలో ఇంకా సత్తా ఉందన్న తానియా... ఏడాదికి ఒకటి లేదా రెండు చొప్పున టోర్నీలు ఆడుతూ చెస్ వ్యాఖ్యానంపైనే ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది.