
స్వదేశంలో పాకిస్తాన్‌తో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 8) ప్రారంభం కాబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు వెస్టిండీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ మాథ్యూ ఫోర్డ్ నిన్న ట్రైనింగ్ సెషన్ సందర్భంగా గాయపడ్డాడు. అతని భుజం రీలొకేట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో అతను సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
ఫోర్డ్‌కు ప్రత్యామ్నాయంగా విండీస్ క్రికెట్ బోర్డు 21 ఏళ్ల బౌలింగ్ ఆల్‌రౌండర్ జోహన్ లేన్‌కు పిలుపునిచ్చింది. లేన్ ఇటీవల వెస్టిండీస్-ఏ జట్టు తరఫున విశేషంగా రాణించాడు. లేన్ తన స్వల్ప దేశవాలీ కెరీర్‌లో 12 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 17.71 సగటున 124 పరుగులు చేశాడు. లేన్ ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు.
వెస్టిండీస్‌కు 2027 వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే పాక్‌తో ఈ సిరీస్ చాలా కీలకం. ఈ సిరీస్‌లో గెలిస్తే ఆ జట్టు వరల్డ్‌కప్ డైరెక్ట్ క్వాలిఫికేషన్ అవకాశాలు మెరుగవుతాయి. ఈ సిరీస్‌కు ముందు విండీస్ పాక్‌కు టీ20 సిరీస్ కోల్పోయింది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో గెలుచుకుంది.
పాక్‌తో తొలి వన్డే భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 11:30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో వన్డే ఆగస్ట్ 10, మూడో వన్డే ఆగస్ట్ 12న జరుగనున్నాయి. మూడు వన్డేలు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరుగనున్నాయి.
పాక్‌తో వన్డే సిరీస్‌కు అప్‌డేట్ చేసిన వెస్టిండీస్ జట్టు:
షాయ్ హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, జెడియా బ్లేడ్స్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్, జోహన్ లేన్