
టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్‌లు అజింక్యా రహానే, ఇషాంత్ శర్మలకు బీసీసీఐ చరమగీతం పడనున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌ల నుంచి రహానే, ఇషాంత్ శర్మను బీసీసీఐ తొలిగించనున్నట్లు సమాచారం. కాగా ఫామ్ కోల్పోయి గత కొంత కాలంగా ఇబ్బంది పడుతున్న వీరిద్దరిని భారత సెలక్టర్లు ఇప్పటికే పక్కన పెట్టారు.
రహానే చివరసారిగా భారత తరపున ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకపై ఆడగా.. ఇషాంత్ గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌పై బరిలోకి దిగాడు. మరోవైపు వైట్‌బాల్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మాన్ గిల్‌కు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రూప్-సిలో ఉన్న హార్దిక్, సూర్య, గిల్ గ్రూప్-బి లోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక డిసెంబర్ 21న జరిగే బోర్డు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. "సూర్య, హార్దిక్ ప్రస్తుతం గ్రూపు సిలో ఉన్నారు. ఈ ఏడాదిలో వీరిద్దరూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. కాబట్టి వాళ్లకు గ్రూపు-ఎ కాకపోయినా కనీసం గ్రూప్-బి ప్రమోషన్ ఇవ్వాలి అనుకుంటున్నాము.
సూర్య ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో నెం1 స్థానంలో ఉన్నాడు. అతడికి వన్డే జట్టులో కూడా పోటీగా ఉన్నాడు. ఈ విషయాలపై అపెక్స్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుంది" అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. గ్రూప్-సిలో ఉన్న ఈ ముగ్గురు గ్రూప్-బి లోకి వారి పే గ్రేడ్ రూ. 3 కోట్లు అవుతుంది. అదే విధంగా ఈ సమావేశంలో టీ20 ప్రపంచకప్, బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ లో భారత్ ఓటమిపై సమీక్ష నిర్వహించనున్నారు.
ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఆటగాళ్లు వీరే
కేటగిరీ-ఎ ప్లస్ (రూ.7 కోట్లు)
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లి
జస్ప్రీత్ బుమ్రా
కేటగిరీ-ఎ( రూ.5కోట్లు)
రవిచంద్రన్ అశ్విన్
రవీంద్ర జడేజా
రిషబ్ పంత్
కేఎల్ రాహుల్
మహ్మద్ షమీ
కేటగిరీ-బి(రూ. 3కోట్లు)
చెతేశ్వర్ పుజారా
అజింక్యా రహానే
అక్షర్ పటేల్
శార్దూల్ ఠాకూర్
శ్రేయాస్ అయ్యర్
మహ్మద్ సిరాజ్
ఇషాంత్ శర్మ
కేటగిరీ-సి(రూ. కోటి)
శిఖర్ ధావన్
ఉమేష్ యాదవ్
భువనేశ్వర్ కుమార్
హార్దిక్ పాండ్యా
వాషింగ్టన్ సుందర్
శుభమాన్ గిల్
హనుమ విహారి
యుజ్వేంద్ర చాహల్
సూర్యకుమార్ యాదవ్
వృద్ధిమాన్ సాహా
మయాంక్ అగర్వాల్
దీపక్ చాహర్
చదవండి: Dinesh Karthik: ధావన్ పని అయిపోయింది? గబ్బర్‌పై దినేశ్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు