
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ క్రికెట్‌లో మరో కొత్త జర్నీని ప్రారంభించాడు. 2008లో ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా (2015-2019), బీసీసీఐ బాస్‌గా (2019-2022), ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా (2019), ఆతర్వాత అదే ఫ్రాంచైజీకి పురుషులు, మహిళల విభాగంలో (డబ్ల్యూపీఎల్) డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా (2023-), ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా (కొనసాగుతున్నాడు) పలు పదవులకు వన్నె తెచ్చిన గంగూలీ.. తొలిసారి కోచింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు.
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2026 ఎడిషన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ప్రిటోరియా క్యాపిటల్స్ గంగూలీని హెడ్ కోచ్‌గా నియమించింది. గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన (చివరి నుంచి రెండో స్థానం) అనంతరం ప్రిటోరియా క్యాపిటల్స్ గంగూలీ నియామకాన్ని చేపట్టింది. త్వరలో జరుగబోయే (సెప్టెంబర్ 9న) ప్లేయర్ల వేలంలో గంగూలీ ఆ ఫ్రాంచైజీ తరఫున కీలకంగా వ్యవహరించనున్నాడు.
గంగూలీ నియామకాన్ని ప్రిటోరియా క్యాపిటల్స్ యాజమాన్యం ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్ నుంచి గంగూలీ బాధ్యతలు చేపడతాడు.
గంగూలీకి అసిస్టెంట్‌గా పొలాక్
ప్రిటోరియా క్యాపిటల్స్ యాజమాన్యం గంగూలీతో పాటు మరో నియామకాన్ని కూడా చేపట్టింది. గంగూలీకి అసిస్టెంట్‌గా సౌతాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ షాన్ పొలాక్‌ను నియమించింది. పొలాక్ వచ్చే సీజన్‌లో క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తాడు.