
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టుకు రంగం సిద్దమైంది. మార్చి 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో అమీతుమీ తెల్చుకోవడానికి ఇరు జట్లు ఊవ్విళ్లూరుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు మూడో టెస్టు ఫలితాన్ని రిపీట్ చేసి సిరీస్ సమం చేయాలని ఆస్ట్రేలియా వ్యూహాలు రచిస్తోంది.
ఇక తొలి మూడు టెస్టుల్లో విఫలమైన భారత వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్‌ను నాలుగో టెస్టుకు పక్కన పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ తన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్న భరత్.. బ్యాటింగ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన భరత్.. వరుసగా 8, 6, 23(నాటౌట్), 17, 3, మొత్తం 57 రన్స్ మాత్రమే చేశాడు.
దీంతో అతడి స్థానంలో మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టెస్టు అరంగేట్రం చేయనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం భరత్‌కు మద్దతుగా నిలిచాడు. భరత్ బ్యాటింగ్ ఫామ్‌తో జట్టు మేనేజ్‌మెంట్‌కు సంబంధం లేదని, అతను స్టంప్‌ల వెనుక అద్భుతంగా రాణిస్తున్నాడని ద్రవిడ్ కొనియాడాడు.
"భరత్ బ్యాటింగ్ ఫామ్‌పై మేము ఎలాంటి ఆందోళన చెందడం లేదు. కానీ అతడకి పరిస్థితులను అర్ధం చేసుకుని ఆడే సత్తా ఉంది. అతడు మూడో టెస్టులో అత్యుత్తమంగా రాణించకపోయినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 17 పరుగులు మాత్రం చాలా కీలకమైనవి. ఢిల్లీ టెస్టులో కూడా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేశాడు.
ఇటువంటి పరిస్థితుల్లో అతడు అద్భుతంగా రాణించాలంటే కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ అతడు వికెట్లు వెనుక చాలా యాక్టివ్‌గా ఉంటాడు. డీఆర్‌ఎస్‌లు తీసుకోవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని దక్కించుకున్నాడు. కాబట్టి అతడి బ్యాటింగ్ ప్రదర్శనను మేము పరిగణలోకి తీసుకోవడం లేదు అని హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ద్రవిడ్ పేర్కొన్నాడు.
చదవండి: WI vs SA: దక్షిణాఫ్రికాతో వైట్‌బాల్ సిరీస్.. క్రికెట్ వెస్టిండీస్ కీలక నిర్ణయం!