R Ashwin Comes Close Running-Out Marnus Labuschagne Non-Strikers-End - Sakshi
Sakshi News home page

Ravichandran Ashwin:'చేసేయాల్సింది ఒక పనైపోయేది..'

Feb 17 2023 3:24 PM | Updated on Feb 17 2023 4:41 PM

R Ashwin Comes Close Running-Out Marnus Labuschagne Non-Strikers-End - Sakshi

క్రికెట్‌లో మన్కడింగ్‌ అనగానే గుర్తుకు వచ్చే క్రికెటర్‌ రవిచం‍ద్రన్‌ అశ్విన్‌. ఐపీఎల్‌లో జాస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ చేసి అశ్విన్‌ చరిత్రలో నిలిచిపోయాడు. ఆ తర్వాత మరోసారి కూడా మన్కడింగ్‌ చేశాడు. అశ్విన్‌ చర్యపై అభిమానులు రెండుగా చీలిపోయారు. మన్కడింగ్‌ అంశంపై చాలా వివాదాలు జరిగాయి. అయితే చివరకు మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తూ చట్టబద్ధం చేసింది మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ).

అప్పటినుంచి మన్కడింగ్‌ను రనౌట్‌గా పిలవడం మొదలుపెట్టారు. ఈ నిబంధన అమల్లోకి వచ్చినప్పటి నుంచి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌ రనౌట్స్‌ తగ్గిపోయాయి. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని తెలిసి కొంతమంది బౌలర్లు నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌ బ్యాటర్లను హెచ్చరిస్తున్నారే తప్ప రనౌట్‌ చేయడం లేదు. తాజాగా అశ్విన్‌ మరోసారి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌ బ్యాటర్‌కు హెచ్చరికలు పంపాడు.

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇది చోటుచేసుకుంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో మార్నస్‌ లబుషేన్‌ ఉన్నాడు. అశ్విన్‌ బంతి విడవడానికి ముందే లబుషేన్‌ క్రీజు దాటాడు. ఇది గమనించిన అశ్విన్‌ చేతిలో నుంచి బంతిని విడవలేదు. అశ్విన్‌ చర్యతో వెంటనే అలర్ట్‌ అయిన లబుషేన్‌ తన బ్యాట్‌ను తిరిగి క్రీజులో పెట్టాడు. ఆ తర్వాత అశ్విన్‌ చిరునవ్వుతో లబుషేన్‌వైపు చూస్తూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన అభిమానులు మాత్రం అశ్విన్‌ చేసేయాల్సింది ఒక పని అయిపోయేది.. అంటూ కామెంట్‌ చేశారు. ఆ తర్వాత అశ్విన్‌ బౌలింగ్‌లోనే మార్నస్‌ లబుషేన్‌ వెనుదిరిగాడు. 90 పరుగుల వరకు ఒక్క వికెట్‌ కోల్పోయి పటిష్టంగా కనిపించిన ఆసీస్‌ అశ్విన్‌ దెబ్బకు వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. పీటర్‌ హ్యాండ్స్‌కోబ్‌ 54 పరుగులతో ఆడుతున్నాడు. అంతకముందు ఉస్మాన్‌ ఖవాజా 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్‌ మూడు వికెట్లు తీయగా.. జడేజా, షమీ చెరొక రెండు వికెట్లు పడగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement