
శ్రీలంక-పాకిస్తాన్‌తో జరగనున్న టీ20 ట్రై సిరీస్ నుంచి అఫ్గానిస్తాన్ వైదొలిగిన సంగతి తెలిసిందే. తమ దేశంపై పాకిస్తాన్ సైన్యం చేసిన వైమానిక దాడిని ఖండిస్తూ అఫ్గన్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్‌లోని అర్గున్, బర్మల్ జిల్లాలపై పాక్ సైన్యం చేసిన దాడిలో ముగ్గురు వర్ధమాన క్రికెటర్లు మృతి చెందారు ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన అఫ్గన్ బోర్డు పాక్ గడ్డపై క్రికెట్ ఆడేది లేదని తేల్చి చెప్పింది.
అయితే అఫ్గానిస్తాన్ తప్పుకొన్నప్పటికి ఈ ముక్కోణపు టోర్నీ షెడ్యూల్ ప్రకారం జరగనుంది. ఈ టోర్నీలో అఫ్గాన్ స్ధానాన్ని జింబాబ్వేతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. ఇప్పటికే ఈ విషయంపై జింబాబ్వే క్రికెట్ బోర్డుతో పీసీబీ చర్చలు జరిపింది. అందుకు జింబాబ్వే క్రికెట్ కూడా అంగీకరించనట్లు పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా అఫ్గానిస్తాన్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు నేపాల్, యూఏఈ క్రికెట్ బోర్డులతో కూడా పాక్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కానీ అందుకు ఆయా క్రికెట్ బోర్డులు కాస్త సమయం కోరినట్లు సమాచారం. కానీ అంతలోనే జింబాబ్వే ఒప్పుకోవడంలో అప్‌డేటడ్ షెడ్యూల్‌ను పీసీబీ విడుదల చేసింది.
అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శల వర్షం కురుస్తోంది. మీ దేశం చేసిన దాడిలో ముగ్గురు యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోతే .. సంతాపం తెలపాల్సింది బదులు కొత్త షెడ్యూల్ రిలీజ్ చేస్తారా? అంటూ ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు.
నవంబర్ 17 నుండి 29 వరకు జరగనున్న ఈ ముక్కోణపు సిరీస్‌కు రావల్పిండి, లహోర్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ సిరీస్ టీ20 ప్రపంచకప్-2026 సన్నాహాకాల్లో భాగంగా జరగనుంది. కాగా ఈ యువ క్రికెటర్ల మృతి పట్ల ఐసీసీ, బీసీసీఐ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.
ట్రైసిరీస్ షెడ్యూల్
17 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి
19 నవంబర్ – శ్రీలంక వర్సెస్ జింబాబ్వే, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి
22 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, గడాఫీ స్టేడియం, లాహోర్
23 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే, గడాఫీ స్టేడియం, లాహోర్
25 నవంబర్ – శ్రీలంక వర్సెస్ జింబాబ్వే, గడాఫీ స్టేడియం, లాహోర్
27 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, గడాఫీ స్టేడియం, లాహోర్
29 నవంబర్ – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్